తూర్పుగోదావరిలో కోడి పందాలపై ఉత్కంఠ.. అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు

తూర్పుగోదావరిలో కోడి పందాలపై ఉత్కంఠ.. అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు

Tension continues over chicken races : తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోనసీమ సహా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బరులను పోలీసులు ధ్వంసం చేశారు. కోడిపందేల అడ్డుకట్టకు 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోడిపందేలు నిర్వహిస్తే నిర్వాహకులు, స్థల యజమానులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రజా ప్రతినిధులపై పందెం రాయుళ్లు ఒత్తిడి చేస్తున్నారు. నిర్వాహాకులు కూడా మరికాసేపట్లో కోడి పందేలు ప్రారంభమవుతాయని పందెం రాయుళ్లకు భరోసా ఇస్తున్నారు.

ఏపీలో సంక్రాంతి పండుగ సందడి మొదలవడంతో కోళ్ల పందాల జోరు మళ్లీ మొదలైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కోడి పందాల కోసం పందెం రాయుళ్లు కోళ్లను సిద్ధం చేస్తున్నారు. కోళ్ల పందాలు అంటే మామూలు కాదు. కొందరు కోళ్ల పందాలు మామూలుగా నిర్వహిస్తారు. మరికొందరు మామూలు కోళ్ల పందాలతో కిక్ ఏముంటుందంటూ కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తుంటారు.

వారి ఆట కట్టించేందుకు పోలీసులు కోడికత్తుల తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో కోడికత్తుల తయారీ స్థావరంపై దాడి చేశారు. ఆత్కూరులోని ఓ కర్మాగారంపై దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 700 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడి కత్తుల తయారీ కోసం వినియోగించే సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.