ఫ్రెండ్స్ ముందు టీచర్ మందలించాడని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 03:32 PM IST
ఫ్రెండ్స్ ముందు టీచర్ మందలించాడని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

వారంతా విద్యార్థులు. వారిది ఎంతో ఉజ్వల భవిష్యత్‌. విద్యార్థులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. జీవితం అన్నాక సమస్యలు కామన్‌. కాస్త ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారమూ దొరుకుతుంది. కానీ కొందరు విద్యార్థులు.. సమస్యకు చావే పరిష్కారమంటూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉరేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఓ విద్యార్థి ఘటన మరవకముందే మరో విద్యార్థి ఘటన వెలుగులోకి వస్తుండటం కలకలం రేపుతోంది. ఉపాధ్యాయుల వేధింపులంటూ కొందరు.. ప్రేమ వేధింపులంటూ మరికొందరు.. పేరెంట్స్‌ మందలించారని ఇంకొందరు.. ఇలా ఏదో ఒక కారణంతో స్టూడెంట్స్‌ మృత్యుబాట పడుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన చేతులతో… ఉరి తాడును పట్టుకుంటున్నారు. సమస్యకు చావే శరణ్యమంటూ ఆ ఉరి తాడుకు వేలాడుతున్నారు.

తోటి విద్యార్థుల ముందు మందలించారని సూసైడ్:
తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులోని ఓ స్కూల్‌ లో 10వ తరగతి విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువులో వెనకబడిపోయాడనే కారణంతో టెన్త్‌ చదివే బాలుడిని..సదరు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థుల ముందు మందలించారు. స్టడీ అవర్‌ పేరుతో రాత్రి, పగలు తేడా లేకుండా స్కూల్‌ లోనే ఉంచి చదివించారు. దాంతో మనస్థాపానికి గురైన బాలుడు స్కూల్లో అందరూ పడుకున్న సమయం చూసి తరగతి గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాలేజీ ప్రాంగణంలో ఆత్మహత్య:
ఇక కృష్ణా జిల్లా విజయవాడలో ఈ ఘటనకు ఒక్క రోజు ముందు ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నూజివీడు సిద్ధార్థ కాలేజీలో బీఫార్మసీ సెకండియర్ చదువుతున్న శైలజ..గురువారం మధ్యాహ్నం కళాశాల ప్రాంగణంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. తన చావుకి ఎవరూ కారణం కాదంటూ…తన ఆత్మహత్య గురించి ఎలాంటి ఎంక్వైరీ చేయోద్దని సూసైడ్‌ లెటర్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది. వీరిద్దరే కాదు పలు కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతునే ఉన్నారు.

కష్టాలు లేని మనుషులు ఉండరు. సమస్యలు లేని కుటుంబాలు లేవు. మనుషులకే కాదు, ఈ భూమ్మీద సమస్త జీవరాశులూ కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్నాయి. ప్రతికూల వాతావరణంలోనూ బతకడం ఎలాగో తెలుసుకుంటున్నాయి. తమ పిల్లలకూ నేర్పిస్తున్నాయి. కానీ మనిషి మాత్రమే వాటికి జడిసి ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. చిన్న కష్టానికి, సమస్యకూ ఆత్మహత్యే పరిష్కారమని పొరబడుతున్నారు. 

జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు. ఒకటి కాలం, రెండోది ప్రాణం. క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. ఇకనైనా హత్య, ఆత్మహత్యలకు పాల్పడే ముందు మిమ్మల్ని నమ్ముకున్న వారి గురించి ఒక్క క్షణం ఆలోచించండి. ఒక్క క్షణం సానుకూలంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం కళ్ల ముందే కనిపిస్తుంది.