ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు | distribution of the corona vaccine in ap

ఏపీలో కరోనా వ్యాక్సిన్..కోటి మందికి పంపిణీ ఏర్పాట్లు

ఏపీలో కరోనా వ్యాక్సిన్..కోటి మందికి పంపిణీ ఏర్పాట్లు

arrangements for the distribution of the corona vaccine in ap : కరోనా వ్యాక్సిన్‌ పంపిణీనికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చుకుంటోంది. గన్నవరంలోని వ్యాధినిరోధక కేంద్రానికి 30 లక్షల డిస్పోజబుల్‌ సిరంజీలు చేరుకున్నాయి. వ్యాక్సిన్‌ నిల్వ చేసుకునేందుకు అవసరమైన ఐస్‌ కోల్డ్‌ రిఫ్రిజిరేటర్లును ప్రభుత్వం తెప్పించింది. రాష్ట్రంలో కోటి మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా డాక్టర్లు, పారా మెడికల్‌, పారిశుధ్య సిబ్బంది, పోలీసులకు వ్యాక్సిన్‌ ఇస్తారు. అలాగే యాభై ఏళ్ల వయసు పైబడిన వారికి టీకా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన మెడికల్ ఎక్విప్‌మెంట్ ఒక్కొక్కటిగా రాష్ట్రానికి అందుతున్నట్లు సమాచారం. 43 లక్షల డిస్పోజబుల్‌ సిరంజీలను పంపేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తొలివిడతలో 30 లక్షల వరకు పంపించింది. 0.5 ఎమ్ఎల్ కెపాసిటీ ఉన్న సిరంజీల ద్వారా టీకాను ఇంజెక్షన్‌ రూపంలో చేతికి ఇస్తారని తెలుస్తోంది.

టీకా నిల్వ చేసేందుకు ఉపయోగించే భారీ ఐస్‌ లైన్డ్‌ రిఫ్రిజరేటర్లు (లార్జ్‌-ఐఎల్‌ఆర్‌) 36 కృష్ణా జిల్లా గన్నవరంలోని వ్యాక్సిన్లు భద్రపరిచే స్టేట్ సెంటర్‌కు చేరాయి. సోమవారం నుంచి పర్టిక్యులర్ సెంటర్లకు పంపనున్నారు. త్వరలోనే 6వాక్‌-ఇన్‌-కూలర్స్‌ రానున్నాయి. మూడింట్లో 40 వేల లీటర్లు, మరో మూడింట్లో 16వేల 500 లీటర్ల చొప్పున టీకాను భద్రపరుస్తారు.

టీకాలు భద్రపరిచే సెంటర్లలో 50 సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. గన్నవరంలోని ప్రధాన కార్యాలయంతో పాటు విశాఖ, గుంటూరు, కడప, కర్నూలు జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖ కమాండ్‌ కంట్రోల్‌ రూంకు కనెక్ట్ చేస్తారు. ప్రస్తుతం గర్భిణులు, చిన్నారులకు వేసే వ్యాక్సిన్‌ రవాణాకు రాష్ట్రంలో 26 వాహనాలు ఉన్నాయి. అదనంగా మరో 25 వాహనాలను చేర్చనున్నారు.

రేపటి నుంచి విజయవాడలో మొదలు పెట్టనున్న కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్‌కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. డ్రై రన్ ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. కృష్ణా జిల్లాలోని 5 ప్రాంతాల్లో డ్రై రన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఒక్కో సెంటర్లో 25 మందికి వ్యాక్సిన్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. సిబ్బందికి శిక్షణ, నిర్వహణ పటిష్టంగా చేస్తామని చెప్పారు. సోమవారం ఉదయం 8గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కోవిడ్ డ్రై రన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్రిటన్‌ నుంచి ఏపీకి వచ్చిన మరో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. వీటి శాంపుల్స్‌ను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. దీంతో యూకే నుంచి స్టేట్‌కు వచ్చిన వారిలో పాజిటివ్‌ సంఖ్య 6కు చేరింది. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి, గుంటూరు జిల్లాలో ఇద్దరికి చొప్పున వైరస్‌ నిర్ధారణ అయింది.

×