మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు… హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్

మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్‌ఈసీ ఆదేశాలు… హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్

The AP government filed House Motion Petition in the High Court : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21 వరకు హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఎస్‌ఈసీ ఆదేశాలపై హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.

మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అలాగే మంత్రికి మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని తేల్చి చెప్పింది. ఈ నెల(ఫిబ్రవరి) 21వ తేదీ వరకు పెద్దిరెడ్డిపై ఆంక్షలను అమలు చేయాలని ఎస్ఈసీ చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతో పాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని డీజీపీకి రాసిన లేఖలో తెలిపింది. తన ఫిర్యాదుకు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన పత్రిక క్లిప్పింగులను జత చేసింది. ఎన్నికలు సజావుగా సాగేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకే ఈ చర్యలని ఎస్ఈసీ తెలిపారు.

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలు నిలిపివేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడంపై పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి శుక్రవారం(ఫిబ్రవరి 5,2021) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని, ఏకగ్రీవాలను ప్రకటించకపోతే ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను అమలు చేయకూడదని ఆయన రిటర్నింగ్ అధికారులకు సూచించారు.

అంతేకాదు నిమ్మగడ్డ ఆదేశాలను పాటించే అధికారులను తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బ్లాక్ లిస్టులో పెడతామని, ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. మంత్రి చేసిన ఆ వ్యాఖ్యలకు కౌంటర్ గానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ చర్యలు తీసుకున్నారనే చర్చ నడుస్తోంది.