Airport : విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణ..!

ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రవేయిట్ బాట పటిస్తున్న కేంద్రం కన్ను ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్టుపై పడింది. విమానాశ్రయాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Airport : విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణ..!

Airport

Vijayawada Airport Privatization : ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రవేయిట్ బాట పటిస్తున్న కేంద్రం కన్ను ఇప్పుడు గన్నవరం ఎయిర్‌పోర్టుపై పడింది. విమానాశ్రయాన్ని ప్రయివేట్ పరం చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. 2024నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తోంది. ఎంతో అభివృద్ధి సాధించడానికి వీలున్న విమానాశ్రయాన్ని ప్రయివేటీకరించాలని కేంద్రం ఎందుకు అనుకుంటోంది…? అంతిమంగా ఇది ప్రయాణికులకు లాభమా…నష్టమా…?

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వందశాతం ప్రయివేటీకరించడంపై భారీ ఎత్తున జరుగుతున్న ఆందోళనలు కేంద్రానికి కనిపించం లేదు. ఎవరి సలహాలూ, సూచనలు పట్టించుకోకుండా…ఆందోళనలకు విలువ ఇవ్వకుండా ప్రయివేటీకరణపై ముందుకుపోతోంది కేంద్రం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ కొనసాగిస్తామని ప్రకటించిన కేంద్రం..ఆ దిశగా మరిన్ని అడుగులు వేస్తోంది. ఉక్కు కర్మాగారాలు, రైల్వేలతో పాటు విమానాశ్రయాలనూ ప్రయివేటీకరించేందుకు సిద్ధమయింది. ఇందులో భాగంగా కేంద్రం దృష్టి ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంపై పడింది. రాష్ట్ర విభజన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో పెట్టుబడులు ఉపసంహరించి…ప్రయివేట్ వ్యక్తులకు, సంస్థలకు అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

అంతర్జాతీయ విమానాశ్రయంగా బెజవాడ ఎయిర్ పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే వేలాది విమాన సర్వీసులు రాకపోకలు సాగించడంతో ఎన్నో రికార్డులు నమోదు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయవాడ ఎయిర్ పోర్ట్ కు విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. విదేశీ ప్యాసింజర్ల సంఖ్య కూడా రెట్టింపైంది. అనేక విమాన సంస్థలు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విదేశాలకు తమ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభించాయి. విదేశాలకు మళ్లీ విమానాల రాకపోకలు మొదలయ్యాయి. బెజవాడ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు విమానం నడుస్తోంది.

వందే భారత్ మిషన్ కింద ప్రతి మంగవారం గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమాన సర్వీసు నడవనుంది. గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విమానం 3.30 గంటల్లోనే మస్కట్‌కు చేరుకుంటుంది. 13 జిల్లాలకు ఈ ఎయిర్ పోర్ట్ అందుబాటులో ఉండటంతో రాకపోకలకు అనువుగా మారింది. దీంతో మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్ట్ లకు దీటుగా అభివృద్ధి సాధించింది. ఏటా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య 10 లక్షలు దాటుతోంది.

గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం పదేళ్లలో దాదాపుగా 3వేల కోట్లు పెట్టుబడి పెట్టింది కేంద్రం. ప్రస్తుతం సుమారు 600 కోట్ల పైగా వ్యయంతో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో భారీ టెర్మినల్‌ 2023 సంవత్సరానికి అందుబాటులోకి రానుంది. ఇక ఎయిర్ పోర్ట్‌కు 6 వేల కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. ముందు ముందు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఎయిర్‌పోర్టుకు ఉంది. రెండు మూడేళ్లలోనే ఎయిర్‌పోర్ట్ గణనీయంగా 250 శాతం మేర వృద్ధి సాధించింది.

ఇలా లాభాల్లో ఉన్న ఎయిర్‌పోర్టును 2024నాటికి పూర్తిగా ప్రయివేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఆలోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం ప్రయివేటీకరించాలన్న కేంద్రం ఆలోచనను ఉద్యోగులే కాదు..సామాన్యులూ వ్యతిరేకిస్తున్నారు. అన్నివిధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఎయిర్‌పోర్టును ప్రయివేట్ సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.