మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి..ఎస్‌ఈసీ ఆంక్షలు తొలగించిన హైకోర్టు

మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి అనుమతి..ఎస్‌ఈసీ ఆంక్షలు తొలగించిన హైకోర్టు

The High Court removes SEC restrictions : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మీడియా సమావేశాలు నిర్వహించేందుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఈసీ ఆంక్షలను తొలగించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడొద్దని పెద్దిరెడ్డికి సూచించింది. ఎస్‌ఈసీ లక్ష్యంగా కామెంట్ చేయొద్దని స్పష్టం చేసింది. ఏపీ రాష్ట్రంలో నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఎన్నికలు ముగిసేవరకు మంత్రి పెద్దిరెడ్డిని తన ఇంటి నుంచి బయటకు రాకుండా నియంత్రించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

రాజ్యాంగంలోని 243k నిబంధన ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విశేషాధికారాలతో ఈ ఆదేశాలు జారీ చేశానని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 16 రోజుల పాటు మంత్రి పెద్దిరెడ్డిని మీడియాతో కూడా మాట్లాడకుండా నియంత్రించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు మీడియా సమావేశాలు నిర్వహించేందుకునేందుకు పెద్దిరెడ్డికి అనుమతి ఇచ్చింది.

అంతకముందు ఏపీ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చెల్లదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దిరెడ్డిని గృహ నిర్బంధిస్తూ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేయాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలు చెల్లవని తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్‌ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పెద్దిరెడ్డి దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై ఆదివారం హైకోర్టు విచారణకు స్వీకరించింది.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలో పర్యటించాల్సిన బాధ్యత.. ఆ శాఖ మంత్రిగా పెద్దిరెడ్డికి ఉందన్న పిటిషనర్‌ తరపు న్యాయవాదుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. మంత్రిగా పెద్దిరెడ్డి ఎక్కడైనా పర్యటించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంట్లోనే ఉండాలంటూ ఆంక్షలను విధించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ జారీచేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది.

నిమ్మగడ్డ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోర్టును కోరారు. హైకోర్టులో సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. దాంతో కోర్టు నిమ్మగడ్డ ఉత్తర్వులను కొట్టేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్ చెల్లదంటూ తీర్పును వెల్లడించింది.