10 మంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆస్పత్రే కారణం…స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీ నివేదిక

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 08:06 PM IST
10 మంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆస్పత్రే కారణం…స్వర్ణ ప్యాలెస్ ఘటనపై విచారణ కమిటీ నివేదిక

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన ఏపీలో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషెంట్లు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది.



స్వర్ణ ప్యాలెస్ ఘటనపై బుధవారం (ఆగస్టు 19, 2020) విచారణ కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రమేష్ ఆస్పత్రి ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిందని పేర్కొంది. వైద్య విలువలను కూడా నీరు గార్చింది.

ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోలేదని వెల్లడించింది. డబ్బు సంపాదించాలన్న యావతో నిబంధనలు పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది. పది మంది ప్రాణాలు కోల్పోవడానికి రమేష్ ఆస్పత్రే కారణమని నివేదికలో పేర్కొంది.



ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కొవిడ్ పేషెంట్లు చనిపోయారు. ప్రమాద ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రమేష్ హాస్పిటల్ కు జిల్లా కలెక్టర్, డీఎమ్ హెచ్ వో నోటీసులు జారీ చేసింది. జేసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇంతియాజ్ నోటీసులు ఇచ్చారు.

భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పేషెంట్ల నుంచి అత్యధిక మొత్తం వసూలు చేస్తున్నారని నిర్ధారించడంతో రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ కు ఇచ్చిన అనుమతి రద్దు చేశారు. రమేష్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్స్ ను చేర్చుకోవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.



స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రమేష్ ఆస్పత్రిలో పని చేస్తున్న పలువురు ప్రముఖులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారించారు.