పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠం భూమి…ఆ భూమి తమదంటూ కుటుంబం ఆత్మహత్యాయత్నం

10TV Telugu News

చిత్తూరు జిల్లాలోని నగరి మండలం ముడిపల్లి గ్రామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పేదల ఇళ్ల పట్టాల కోసం గ్రామకంఠ భూమిని చదును చేయడానికి అధికారులు ప్రయత్నించారు. ఆ పనులను స్థానిక గిరి నాయుడు కుటుంబం అడ్డుకుంది. చాలా ఏళ్లుగా ఆ భూమిని తమ ఆధీనంలో ఉందని ఆ కుటుంబ సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాళ్లను మెడకు చుట్టుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ సిబ్బంది, పోలీసులు గిరి ఫ్యామిలీ ఆత్మహ్యతకు పాల్పడకుండా అడ్డుకున్నారు.

రెవెన్యూ రికార్డు ప్రకారం అయితే గ్రామ కంఠంగా ఉంది. 2 ఎకరాల వరకు గ్రామ కంఠ భూమి ఉంది. అంటే ప్రభుత్వ భూమి అని అర్థం. అయితే జులై 8న పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది ఆ భూమినంతా కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు. నిజానికి ఈ భూమి ఎన్నో ఏళ్లుగా స్థానిక గిరి నాయుడు అనే కుటుంబీకుల ఆధీనంలో ఉంది. అయితే ఇవాళ ఒక్కసారిగా రెవెన్యూ యంత్రాంగం జేసీబీలతో వచ్చి ఆ స్థలాన్ని చదును చేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో గిరి నాయుడు సోదరులు, వారి ఇంట్లోని వ్యక్తులందరు పది మంది వచ్చి రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. చివరకు బలవంతంగా జేసీబీలతో చదును చేయడంతో గిరి నాయుడు కుటంబ సభ్యులందరూ మెడలకు తాళ్లను చుట్టుకుని ఇక్కడే గొంతు బిగించుకుని చచ్చి పోయేందుకు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని అడ్డుకున్నారు.

ఒక దశలో వారంతా కూడా జేసీబీ దగ్గరకు వెళ్లి దాని కింద పడుకునే ప్రయత్నం చేశారు. కేవలం తాము తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులం, చాలా కాలంగా పార్టీలో ఉన్నామనే కారణంగానే తమ ఆధీనంలో ఉన్న ఈ భూములను బలవంతంగా రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారంటూ గిరి నాయుడు కుటుంబం ఆరోపిస్తోంది.

ఎన్నో ఏళ్లుగా భూమి తమ ఆధీనంలో ఉంచుకున్నామని, ఆకస్మికంగా జేసీబీలతో వచ్చి తమ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించడం ఏంటని గిరి నాయుడు కుటుంబీకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగ ప్రవేశం చేశారు.

×