ఆస్పత్రిలో కరోనా బాధితుల ప్రేమాయణం

  • Published By: bheemraj ,Published On : July 28, 2020 / 08:21 PM IST
ఆస్పత్రిలో కరోనా బాధితుల ప్రేమాయణం

ఆస్పత్రిలో కరోనా బాధితులు ప్రేమాయణం నడిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లి చేసుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అమ్మాయి, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన అబ్బాయి ఇద్దరూ కరోనా పాజిటివ్ బాధితులు. గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరివి పక్క పక్క బెడులు.

అయితే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినా వారిలో వ్యాధి లక్షణాలు కనిపించ లేదు. దీంతో వారు నిక్షేపంగా బయటపడతామని నిశ్చింతగా ఉన్నారు. వారి మధ్య ముందు మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి.


అబ్బాయి హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. ఇలా ఇద్దరి కోర్సులూ కలిశాయి. పైగా సామాజిక వర్గాలు కూడా ఒకటే కావడం వారికి కలిసొచ్చింది. అక్కడి నుంచే వారిద్దరూ తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపి పెళ్లికి ఆమోదం పొందారు.

ఆస్పత్రిలో చేరిన పది రోజులకు మరోసారి పరీక్షలు చేయగా నెగెటివ్ గా తేలడంతో వారిద్దరినీ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. జులై 25న పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారు పెళ్లి చేసుకున్నారు. ఇదంతా వారం, పది రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది.