Vizianagaram : పురిటి పాట్లు.. 3 కిమీ డోలీలో గర్భిణి

ఆ కొండల్లోకి వాహనాలు వెళ్లవు.. ఏదైనా అయితే మనుషులే మోసుకు రావాలి. విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో తరచుగా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీలను.. నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే ఇలా డోలీలపై మోసుకెళ్లాల్సిందే

Vizianagaram : పురిటి పాట్లు.. 3 కిమీ డోలీలో గర్భిణి

Vizianagaram

Vizianagaram : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను మూడు కిలోమీటర్ల మేర డోలీలో తీసుకెళ్లారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని సాలూర్ మండల పరిధిలోని మారిపడు సమీపంలోని గిరిజన కుగ్రామాని చెందిన పోతాంగి పార్వతి అనే మహిళకు శనివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. అయితే వారి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దీంతో కట్టెలతో స్ట్రెచర్ తయారు చేసిన కుటుంబ సభ్యులు ఆమెను అందులో కూర్చోబెట్టి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తడిలోవా వద్దకు తీసుకెళ్లారు.

అక్కడ వాహనంలో ఎక్కించి బాగువలసలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా శనివారం పార్వతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్బంగా పార్వతి భర్త మాట్లాడుతూ తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని, ఏదైనా అత్యవసర వైద్యం కావలసి వస్తే 10 కిలోమీటర్లు రావాల్సి వస్తుందని. గర్భిణీలను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఇలా డోలీలోనే తీసుకొస్తామని తెలిపారు.

అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఏడాదిలో పదిమందినైనా ఇలా డోలిలో తీసుకొస్తుంటారు. గ్రామాలు కొండప్రాంతంలో ఉండటంతో ఇక్కడకి రోడ్డు మార్గం సరిగా ఉండదు. మొత్తం కాలిబాటలే ఉంటాయి. ఈ కాలి బాటల్లోంచి వాహనాలు వచ్చే వీలుండదు దీంతో ప్రజలు డోలిలనే వాడుతున్నారు. ఇటువంటి ఘటనలు విజయనగరం, విశాఖ జిల్లాలో తరచు జరుగుతూనే ఉంటాయి.