అమ్మఒడి డబ్బులు అడిగాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్

అమ్మఒడి డబ్బులు అడిగాడని విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపల్

The principal who beat the student in visakha : ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే తనకు అమ్మఒడి రాలేదని అడిగిన ఓ విద్యార్థిపై ప్రిన్సిపల్ దాడి చేశాడు. నడిరోడ్డుపై ఎడా పెడా కొట్టాడు. విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగుతునిలో ఈ సంఘటన జరిగింది. ఏనుగుతుని ప్రాథమికోన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరం 8వ తరగతి చదివిన రూపేశ్‌ కు అమ్మఒడి పథకం వర్తించలేదు. నిరుపేదలైన రూపేశ్ తల్లిదండ్రులు అమ్మఒడి పథకం వచ్చేలా చూడాలని పలుమార్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మను కలిసి ప్రాధేయపడ్డారు.

అయితే సాంకేతిక కారణాల వల్ల అమ్మ ఒడి రాలేదని ఉపాధ్యాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ ఏడాది రూపేశ్ నర్సింగబిల్లి ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతిలో చేరాడు. ఈ పాఠశాలలో అమ్మఒడి పథకం గురించి అడగ్గా.. ముందు చదివిన పాఠశాలలో ప్రాసెసింగ్ చేశారో? లేదో? తెలుసుకొని రావాలని సూచించారు. దీంతో ఆఖరి ప్రయత్నంగా రూపేశ్ మళ్లీ హెచ్ఎం శర్మను కలిశాడు. అమ్మఒడి గురించి అడగడంతో కోపోద్రిక్తుడైన శర్మ.. విచక్షణ మరచి విద్యార్థి చెంప చెల్లు మనిపించాడు.

అంతటితో ఆగకుండా తనను అమ్మఒడి పథకం డబ్బులు అడిగేందుకు ఎంత ధైర్యమంటూ రోడ్డుపైకి తీసుకువచ్చి కొట్టాడు. ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో ప్రధానోపాధ్యాయుడి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.