ఏపీలో పంచాయతీ నామినేషన్ల హడావుడి, విజయనగరం జిల్లాలో తప్ప

ఏపీలో పంచాయతీ నామినేషన్ల హడావుడి, విజయనగరం జిల్లాలో తప్ప

panchayat nominations in AP : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో.. నామినేషన్ కేంద్రాల దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. నామినేషన్ల సమర్పణకు.. ఆదివారం చివరి రోజు కావడంతో.. 2021, జనవరి 29వ తేదీ శుక్రవారం తొలి రోజు నుంచే నామినేషన్లు ఊపందుకున్నాయి. నామినేషన్ పత్రాలు తీసుకెళ్లడానికి వచ్చే వాళ్ల సంఖ్య కూడా బాగానే ఉంది. నామినేషన్ల పత్రాల పంపిణీ, స్వీకరణకు సంబంధించి.. ఎన్నికల అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్లు సమర్పించడంలో.. గ్రామాలకు చెందిన అభ్యర్థులంతా బిజీగా ఉన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలో తప్ప.. మిగతా అన్ని జిల్లాల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే..ఏపీ ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టరేట్‌లో.. కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు డీఐజీ కాంతి రాణా టాటా, ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్లు ఆయనకు స్వాగతం పలికారు. అనంతపురం జిల్లాలో.. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై.. రమేశ్ కుమార్ ఆరా తీశారు. నామినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్ధమైన అభ్యర్థులంతా.. నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నారు. నరసాపురం డివిజన్లో 239 పంచాయతీలు, 2 వేల 552 వార్డులకు.. నామినేషన్లు వేసేందుకు.. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉండి పంచాయతీ దగ్గర.. అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగుర్రు పంచాయతీ కార్యాలయంలో.. నామినేషన్ ప్రక్రియను సబ్ కలెక్టర్ కె.విశ్వనాథన్ పరిశీలించారు. నరసాపురం డివిజన్లో.. 12 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 239 గ్రామపంచాయతీలకు.. 139 మంది స్టేజ్ వన్ అధికారులను నియమించామన్నారు. ఐదు మేజర్ పంచాయతీలకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్‌ను.. ప్రతి పంచాయతీకి ఒక వీఆర్వోను నియమించినట్లు చెప్పారు. ఎన్నికలు.. సజావుగా సాగేలా.. చూసుకుంటామన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాలలోనూ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలివిడతలో.. నంద్యాల మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు గాను తొమ్మిది నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. పులిమద్ది కేంద్రంలో.. ఇప్పటివరకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. అవి కూడా.. ముగ్గురు వైసీపీ నాయకులే సమర్పించారు. వీటిలో.. మునగాల గ్రామానికి చెందిన వారొకరున్నారు. రాయమల్పురానికి చెందిన ఇద్దరు కుటుంబసభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు.

కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను.. కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. జగ్గయ్యపేట మండలంలోని.. పలు గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను.. కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గౌరవరం, గండ్రాయి, మల్కాపురం గ్రామ సచివాలయాలతో పాటు పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన పలు అంశాలపై.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోనూ.. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో.. కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్‌లో.. నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో.. ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ప్రత్యేక బలగాలను అందుబాటులో ఉంచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులు భారీగా నామినేషన్ పత్రాలు తీసుకెళ్తున్నారు. నరసాపురం డివిజన్లో 239 పంచాయతీలు, 2 వేల 552 వార్డులకు.. నామినేషన్లు వేసేందుకు.. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.