ఏపీలో ముగిసిన రెండో విడత పంచాయతీ నామినేషన్లు..

ఏపీలో ముగిసిన రెండో విడత పంచాయతీ నామినేషన్లు..

The second phase of panchayat nominations are over  : ఏపీలో రెండో విడత పంచాయతీ నామినేషన్ల ఘట్టం ముగిసింది. రెండో విడతలో 3వేల335 పంచాయతీలు, 33వేల 632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2వేల 598 సర్పంచ్, 6వేల 421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు 4వేల 760 సర్పంచ్, 19వేల 659 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. ఇవాళ ఆఖరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్, రాత్రిలోగా ఫలితాల వెల్లడించనున్నారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అర్హత పొందారని ఎస్‌ఈసీ ప్రకటించింది. 32 వేల 502 వార్డులకు 79 వేల 799 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 77 వేల 554 నామినేషన్లు మాత్రమే సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించారు. వార్డు సభ్యులకు సంబంధించి మొత్తం 2 వేల 245 నామినేషన్లను తిరస్కరించారు.

మరోవైపు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా జరుగుతాయన్న నిమ్మగడ్డ.. ఎన్నికల నిర్వహనలో తనకు రాజ్యాంగం అపారమైన అధికారాలు ఇచ్చిందన్నారు. హైకోర్టు తీర్పును తాను కచ్చితంగా పాటిస్తానని చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.