కొండపై నుంచి లోయలో పడిన పెళ్లి వ్యాన్.. ఆరుగురు మ‌ృతి

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 05:56 AM IST
కొండపై నుంచి లోయలో పడిన పెళ్లి వ్యాన్.. ఆరుగురు మ‌ృతి

The wedding party van that fell from the hill : అప్పటిదాక ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ తోటి వారు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘాట్ రోడ్డుపై నుంచి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాన్ లోయలో పడిపోయింది. ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.



గోకవరం మండలం ఠాగూరు పాలెంకు చెందిన యువకుడితో రాజానగరం మండలం వెలుగుబంట్లకు చెందిన యువతితో వివాహం జరిగింది. తంటికొండ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం రాత్రి 10 గంటల సమయంలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి బంధువులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం 30 మందితో కూడిన ఓ బృందం వ్యాన్ లో బయలుదేరింది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వేరే వాహనంలో బయలుదేరారు.



కొండపై నుంచి స్టార్ట్ చేస్తుండగా..అకస్మాత్తుగా వ్యాన్ ముందుకు కదిలింది. వ్యాన్ ను అదుపు చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో..కొండపై నుంచి నేరుగా కిందకు పడిపోయింది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా…10 మందికి తీవ్రగాయాలయ్యాయి. హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కళ్లెదుటే తమవారు చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.



సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రి, సాయి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. సాయి ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోవడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.
వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.



మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని రాజమండ్రి అర్బన్ ఎస్పీ బాజ్ పాయ్ పరిశీలించారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వ్యాన్ బ్రేక్ లు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందా, డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.