వెండి సింహాల ప్రతిమల చోరీ : బాలకృష్ణ అరెస్టు, విచారణ

వెండి సింహాల ప్రతిమల చోరీ : బాలకృష్ణ అరెస్టు, విచారణ

Theft of silver lion statue : విజయవాడలో వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాలకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాల కేసులో పశ్చిమ గోదావరి పోలీసులకు ఇతను పట్టుబడ్డాడు. అక్కడి పోలీసుల సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రత్యేక బృందం వెళ్లింది. అక్కడనే బాలకృష్ణను విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు.

వెండి సింహాల ప్రతిమలను తునిలో అతను విక్రయించాడని పోలీసులు తేల్చారు. తునిలో బంగారం వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొనుగోలు చేసిన విగ్రహాలను కరిగించినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అధికారికంగా పోలీసులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మూడు వెండి సింహాల ప్రతిమలను చోరీకి గురైన సంగతి తెలిసిందే.

రథంపై కప్పిన కవర్లు కప్పినట్లుగానే ఉన్నాయి. కానీ రథంపై ఉన్న సింహాలు మాయం కావడం కలకలం రేపింది. ఉగాది నాడు రథంపై అమ్మవారి ఊరేగిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా..ఉగాది పండుగ నాడు..రథాన్ని ఉపయోగించలేదు. అంతర్వేదిలో రథం కాలిపోయిన ఘటన మరిచిపోకముందే..ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు.

సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు సమాచారం. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది.