ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ : అప్పుడు జగన్..ఇప్పుడు చంద్రబాబు

ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ : అప్పుడు జగన్..ఇప్పుడు చంద్రబాబు

Jagan  And  Chandrababu : రాజకీయాలూ.. ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. అదికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షమవుతుంది.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికారపీఠంలో కూర్చొంటుంది. ఇదంతా ఎందుకంటే…అప్పుడు జగన్ కు ఎలాంటి పరిస్థితి ఎదురైందో..ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుకు ఎదురైంది. తిరుపతిలోని రేణిగుంట ఎయిర్ పోర్టులో చంద్రబాబు నేలపై బైఠాయించడం, గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ నేలపై కూర్చొన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

2017 సంవత్సరం:-
2017 సంవత్సరంలో ప్రతిపక్షంగా జగన్ ఉన్నారు. ఆ సంవత్సరం జనవరి 26వ తేదీన ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ..విశాఖ బీచ్ రోడ్డులో క్యాండిల్ ర్యాలీకి బయలుదేరారు. జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ..ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబులు ఉన్నారు. పోలీసుల చర్యను జగన్ తప్పుబట్టారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేలపై బైఠాయించారు. ఎయిర్ పోర్టు లాంజ్ లోనికి కూడా అనుమతించలేదు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

రేణిగుంట ఎయిర్ పోర్టు:-
2021 సంవత్సరం, మార్చి 01వ తేదీ సోమవారం తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ..చిత్తూరులో నిరసన తెలియచేసేందుకు బాబు రెడీ అయ్యారు. అందులో భాగంగా..రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ..వీఐపీ లాంజ్ లో నిర్భందించారు. పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబట్టారు బాబు.

శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కు తనకు లేదా ? నోటీసులు ఇవ్వడం ఏంటీ ? మండిపడ్డారు. కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో.. టీడీపీ అధినేత టూర్‌కు నో చెప్పారు. దీంతో నేలపైనే కూర్చొని బాబు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..బాబు వినిపించుకోలేదు. ప్రాంతాలు వేరైనా..సేమ్ సీన్ రిపీట్ అయ్యిందంటున్నారు.