ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్, బారులు తీరిన ఓటర్లు

panchayat polling in AP : ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాతంగా సాగుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా మధ్యాహ్నం పన్నెండున్నర వరకు వరకు 66.48 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 78 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా కడపలో 57.34 శాతం ఓటింగ్ జరిగింది. విశాఖ పట్నం, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 60శాతానికి పైగా నమోదయింది. మధ్యాహ్నం మూడున్నర వరకు ఓటింగ్ జరుగనుంది. విశాఖ మన్యం సహా మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే అన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల దృష్ట్యా మధ్యాహ్నం ఒకటిన్నర వరకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.

పోలింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతిపురం మండలం మఠం, సంతూరు పంచాయతీల్లో ఓటరు స్లిప్పులతో పాటు అభ్యర్ధుల గుర్తు ముద్రించి స్లిప్పులు పంపిణీ చేశారు. అభ్యర్ధుల గుర్తులున్న స్లిప్పులను కొందరు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. వైసీపీ మద్దతుదారులే ఇవి పంపిణీ చేస్తున్నారని టీడీపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కర్నూలు జిల్లా పాతముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రిలో 60 ఏళ్ల తర్వాత ప్రజలు ఓట్లు వేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లా కొండేపి మండలం జాల్లాపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన బూత్‌ ఏజెంట్‌ను.. పోలింగ్‌ కేంద్రం దగ్గరకు రానివ్వకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాటమాట పెరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆందోళనకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా కుప్పం పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తత నెలకొంది. శాంతిపురం మండలం మఠం, సంతూరు పంచాయతీల్లో ఓటరు స్లిప్పులతో పాటు గుర్తు ముద్రించి స్లిప్పులు పంపిణీ చేశారు ఏజెంట్లు. అభ్యర్ధుల గుర్తులున్న స్లిప్పులను కొందరు గ్రామస్థులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే స్లిప్పుల పంపిణీపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టిపాలెంలోని పంచాయతీ ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. తమ గ్రామ రెవెన్యూ సమస్యలను పరిష్కరించమంటూ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ సర్పంచ్‌ అభ్యర్థుతో పాటు 14 వార్డుల పరిధిలోని ఎన్నికలను బహిష్కరించారు.

కర్నూలు జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి, కొత్తముచ్చుమర్రి గ్రామాల్లో తొలిసారి పోలింగ్ జరుగుతోంది. 60 ఏళ్ల నుంచి ఈ పంచాయతీలు ఏకగ్రీవమవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైస్సార్‌సీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి సొంత గ్రామాలు కావడంతో పోలింగ్ సరళిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.