Tirumala Hanuman : హనుమంతుని జన్మస్థలం తిరుమల

అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది.

Tirumala Hanuman : హనుమంతుని జన్మస్థలం తిరుమల

Tirumala Hanuman

Tirumala Hanuman birthplace : అంజనీ సుతుడు హనుమంతుడు తిరుమల కొండపై జన్మించాడని టీటీడీ విశ్వసిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఓ పుస్తకాన్ని ఇవాళ టీటీడీ విడుదల చేయనుంది. పురాణ, ఇతిహాసాల నుంచి సేకరించిన శాస్త్రీయ ఆధారాలతో ఈ పుస్తకం ముద్రించారు. శ్రీవారి ఆలయంలో నవమి ఆస్థానం తర్వాత దేవాలయం వెలుపల ఈ పుస్తకాన్ని విడుదల చేసి భక్తులకు టీటీడీ అందించనుంది.

వానర వీరుడు, వాయుదేవుని సుతుడు హనుమంతుడి జన్మస్థలంపై వివాదం ఈనాటిది కాదు. మారుతి పురిటిగడ్డగా దేశంలో పలు పుణ్య స్థలాలు విరాజిల్లుతున్నాయి. అంజనీదేవి బాల ఆంజనేయునికి జన్మనిచ్చినట్లుగా చెబుతూ వివిధ క్షేత్రాలు భక్తుల చేత పూజలందుకుంటున్నాయి. ఏపీలో తిరుమల క్షేత్రంలో గల జాపాలి తీర్థం ఇందులో ఒకటి. ఆంజనేయుడు ఇక్కడే జన్మించినట్లు కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఏడుకొండలలో ఒకటైన అంజనాద్రిపై వెలసిన జాపాలి వద్ద హనుమంతుడు పుట్టినట్లు కొన్ని స్థల పురాణాల్లో ఉంది.

అంజనీ దేవికి ఇక్కడే బాలాంజనేయుడు జన్మించిన కారణంగానే ఈ ప్రాంత అంజనాద్రిగా ఖ్యాతి కెక్కిందని ఇతిహాసం. ఇక్కడి అటవీ ప్రాంతంలో పురాతన ఆంజనేయ ఆలయం ఉంది. స్థానికులతో పాటు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు జాపాలి వద్దకు వెళ్లి దర్శనం చేసుకుంటారు. భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొంతమంది హనుమాన్ భక్తులు ఆయన్ను కలిశారు. ఆంజనేయుడు జన్మించిన అంజనాద్రి క్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని కోరారు. అయితే ఇదే సమయంలో హనుమంతుని జన్మ స్థలంపై నెలకొన్న పలు వివాదాలు కూడా టీటీడీ ఈవో దృష్టికి వచ్చింది.

కలియుగ దైవం వెంకన్న కొలువై ఉన్న తిరుమల క్షేత్రం హనుమంతుని జన్మ స్థలంగానూ అభివృద్ధి చెందితే మంచిదే కదా అని ఆయన భావించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆంజనేయుని జన్మస్థలాన్ని కూడా చూసి తరిస్తారని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా హనుమంతుని జన్మ స్థలం తిరుమల కొండ అని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు, పురాణాల్లో ఉదహరించిన అంశాలను ప్రస్తావిస్తూ ఓ పుస్తకం ముద్రిస్తే బాగుంటుందని టీటీడీ ఈవో నిర్ణయించారు. వెంటనే ఆయా రంగ నిపుణులు, పండితులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

మూడు నెలల పాటు ఈ కమిటీ హనుమంతుని జన్మ స్థలం ఆధారాలు సేకరించింది. వివిధ రామాయణ గ్రంథాలను పురాణాలను పరిశీలించింది. హనుమంతునిపై ఇదివరకే జరిగిన పరిశోధనా పత్రాలను శోధించింది. తిరుమల కొండపైనే అంజనీదేవి బాల ఆంజనేయునికి జన్మనిచ్చిందని నిరూపించే కీలక ఆధారాలను సేకరించింది. కమిటీ సేకరించిన ఆధారాలను పరిశీలించిన టీటీడీ ఈవో… ఈ అంశాలతో పొందుపరుస్తూ ఓ పుస్తకం ముద్రించాలని ఆదేశించారు. ఉగాది నాటికి పుస్తకం విడుదల చేయాలని తొలుత భావించినా ….శ్రీరామనవమి నాడు ఈ పుస్తకం విడుదల చేయడం సముచితంగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు.

ఆ మేరకు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా టీటీడీ ముద్రించిన ఈ పుస్తకం భక్తులకు అందుబాటులోకి రానుంది. పూర్తి ఆధారాలతో ఈ పుస్తకము అందుబాటులోకి వస్తుందని దేశవ్యాప్తంగా హనుమంతుని జన్మ స్థలంపై చర్చకు అవకాశం కల్పించేలా ఈ పుస్తకం ఉంటుందని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అంటున్నారు. మొత్తం మీద హనుమంతునిపై టీటీడీ ముద్రించిన ఈ పుస్తకం ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.