వివేకా హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 28, 2019 / 10:52 AM IST
వివేకా హత్య కేసులో ముగ్గురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు.వివేకా ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి,ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ ను అరెస్టు చేసినట్టు పులివెందుల పోలీసులు గురువారం(మార్చి-28,2019) ఓ ప్రకటన విడుదల చేశారు.హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

 మార్చి-15,2019 ఉదయం బాత్ రూమ్ లో హత్యకు గురైన వివేకా మృతదేహాన్నిబెడ్ రూమ్ కి తరలించినట్టు గుర్తించిన పోలీసులు…ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు.ఆ రోజు ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో తెలిపారు.వివేకా పేరుతో ఉన్న లేఖను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ కి కృష్ణారెడ్డి ఇచ్చి దాచిపెట్టినట్లు తెలిపారు.

వివేకా హత్య జరిగిన రోజ ఉదయం 5.30 గంటలకు తొలిసారి ఇంట్లోకి  వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడవడంతో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో పోలీసులు విచారించారు. బాత్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కి మృతదేహాన్ని తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ రక్తపు మరకలు కడిగాడని తెలిపారు.

నిందితులను గురువారం(మార్చి-28,2019) పులివెందుల కోర్టులో హాజరుపర్చారు.ఏప్రిల్-8,2019వరకు కోర్టు వారికి రిమాండ్ విధించింది.సుమారు 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే పరమేశ్వర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి అనే నిందితులను పోలీసులు తమ అదుపులోనే ఉంచుకొని విచారిస్తున్నారు. 

ఎర్ర గంగిరెడ్డి ఎవరు?
ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించి ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో పాటు రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల తారుమారు వ్యవహారంలో గంగిరెడ్డినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టు చేయడం కీలక పరిణామం