Tirumala Bramostavam : బ్రహ్మదేవుడే ప్రారంభించిన అద్భుత కార్యం .. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం .. దేవతలే దిగివచ్చి చేసే దివ్యోత్సవ విశేషాలు

Tirumala Bramostavam : బ్రహ్మదేవుడే ప్రారంభించిన అద్భుత కార్యం .. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం .. దేవతలే దిగివచ్చి చేసే దివ్యోత్సవ విశేషాలు

Tirumala Bramostavam : తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవం.. దేవతలే దిగివచ్చి చేసే దివ్యోత్సవం. తిలకించు భక్తులకు నేత్రోత్సవం. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామిని దగ్గరగా వీక్షించే అద్భుత అవకాశం. అలాంటి వేడుక మొదలైంది. ఉత్సవాల్లోనే అత్యంత వైభవమైన ఉత్సహంగా పేరుగాంచింది తిరుమలేశుని బ్రహోత్సవం. మరి దీనికి ఆ విశిష్టత ఎలా వచ్చింది..? అసలు బ్రహ్మోత్సవాల ఆంతర్యం ఏమిటి..?

కలియుగ ప్రత్యక్ష దైవం కోనేటి రాయుడిని కరోనా మహమ్మారి తర్వాత దగ్గరగా చూసే అవకాశం రెండేళ్ల తర్వాత కలిగింది. శ్రీనివాసుని ఉత్సవాల్లో ఎంతో ముఖ్యమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ నేరుగా పాల్గొనే అవకాశాన్ని కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

అంకురార్పణతో మొదలైన ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని వివిధ వాహనాల్లో తిలకించే అవకాశం రెండేళ్ల తర్వాత భక్తులకు కలగడం విశేషం. ఏడుకొండల్లోని ఆనంద నిలయంలో కొలువైయున్న శ్రీ వేంకటేశ్వరుడు.. సప్తగిరుల్లో అడుగు పెట్టిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడ్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని కోరినట్టు పురాణాలు చెబుతున్నాయి. దీంతో శ్రీవేంకటేశ్వరుడికి బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారని ప్రతీతి. బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిచెందాయి. అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అందుకే ఏడాదిలో 365 రోజులు కూడా తిరుమల గిరి గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో ఆ గోవింద నామస్మరణ భువనబాండాలను చుట్టువస్తుంది. మానవులే కాదు దేవతలు సైతం భువి నుంచి దివికి దిగి వచ్చి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని, శ్రీతిరుమలేసుడిని కొలుస్తారని నమ్మకం. దేవతలే వచ్చే అద్భుత ఉత్సవం అవ్వడం వల్లే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంత విశిష్టత.

వేల సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంప్రదాయబద్దంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆనంద నిలయం నుండి బంగారు వాకిలి వరకు, ఉప ఆలయాలు, పూజా సామగ్రి, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పుతో సహా అన్నింటిని శుద్ధి చేస్తారు.

ఒకప్పుడు బ్రహ్మోత్సవాలు ఏడాది పొడువునా.. నెలకి ఒకసారి చొప్పున జరిగేవి. ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒకసారే.. అది కూడా దసరా సమయంలో జరుగుతున్నాయి. ఒకోసారి అధికమాసం వల్ల ఏడాదికి రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో స్వామివారి వాహ‌నం అయిన గ‌రుడుని బొమ్మ ఉన్న జెండాను ఎగ‌ర‌వేయ‌డ‌మే ఈ ధ్వజారోహణం. అలా ధ్వజస్తంభం మీదకు చేరిన గరుడుడు, తన యజమాని అయిన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు రమ్మని ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. దేవతలందరూ వచ్చి శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలను తిలకించడం వల్లే వీటికి అంత ప్రాముఖ్యత. ఇక సాధారణ మానవులకు దొరకే అరుదైన అవకాశమే అని చెప్పాలి.