తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం, చాలా రోజుల తర్వాత మళ్లీ కాసుల వర్షం

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 11:29 AM IST
తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం, చాలా రోజుల తర్వాత మళ్లీ కాసుల వర్షం

tirumala hundi income increases: తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం వచ్చింది.. కరోనా లాక్‌డౌన్‌ టైమ్‌లో వెల వెల బోయిన హుండీలో ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరగడంతో టీటీడీకి ఆదాయం రెట్టింపవుతోంది.

లాక్‌డౌన్‌లో భక్తుల్లేక ఆదాయానికి గండి:
కరోనా సామాన్యులనే కాదు వడ్డీ కాసులవాడిని వదల్లేదు.. లాక్‌డౌన్‌లో భక్తుల్లేక ఆదాయం కోల్పోయిన టీటీడీ ఇప్పుడు గాడిలో పడింది. భక్తుల రాకతో నెమ్మదిగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతోంది. చాన్నాళ్ల తర్వాత తిరుమలేశుడి హుండీ కాసులతో నిండుతోంది. కరోనా సమయంలో ఆదాయం కోల్పోయి.. ఆర్థిక నష్టాల్లో పడిన టీటీడీ.. ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటోంది.


https://10tv.in/apsrtc-good-news-to-people/
చాలా రోజుల తర్వాత 3 కోట్ల హుండీ ఆదాయం:
కరోనా కారణంగా మార్చి 20 నుంచి లాక్‌డౌన్‌ విధించడంతో భక్తులకు అనుమతి నిలిపివేసింది టీటీడీ. భక్తుల్లేకపోయినా.. స్వామివారికి జరగాల్సిన నిత్య పూజలు, కైంకర్యాలలో మాత్రం ఎలాంటి కొరత లేకుండా నిర్వహించారు. భక్తులు లేకపోవడంతో టీటీడీ చరిత్రలోనే మొదటి సారి భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. దాదాపు 3 వందల కోట్ల రాబడి ఆగిపోయింది. ఆర్థిక కష్టాలు వెంటాడటంతో లాక్‌డౌన్‌ తొలి 2 నెలల పాటు ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది టీటీడీ. అన్‌లాక్‌లో భాగంగా జూన్‌ 11 నుంచి స్వామివారి దర్శనాలకు అనుతించడంతో ఆదాయం కాస్త పెరిగింది. దశల వారీగా భక్తుల సంఖ్యనూ పెంచుకుంటూ పోవడంతో నవంబర్ 12న స్వామి వారికి అత్యధికంగా 3.26 కోట్ల హుండీ ఆదాయం లభించింది.

ప్రస్తుతం 25 నుంచి 30వేల మంది భక్తుల రాక:
ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 25 నుంచి 30 వేల మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉంది టీటీడీ. వేంకటేశ్వరుడి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవ సేవకు భక్తులు తమ ఇళ్ల వద్ద నుండే వర్చవల్ గా పాల్గొనడానికి నిర్ణయం తీసుకుంది. వర్చువల్‌ కళ్యాణం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఇంటి నుండి సేవలో పాల్గొనవచ్చు. ఇందులో గృహస్తుల పేరుతో అర్చకులు చేసే సంకల్పాన్ని భక్తులకు చదివి వినిపిస్తారు. ఈ టికెట్‌పై 6 నెలల కాలంలో ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించింది టీటీడీ.

ప్రతి రోజు 5వేల 500మంది భక్తులకు దర్శనం:
వెయ్యి రూపాయల విలువైన కళ్యాణం టికెట్‌పై ఇద్దరిని దర్శనానికి అనుమతిస్తారు. ఈ తరహాలోనే మరిన్ని ఆర్జిత సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, డోలోత్సవం, సహస్త్ర దీపాలంకరణ సేవలను కూడా వర్చువల్‌గా నిర్వహిండానికి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది కూడా. ఈ రకంగా ప్రతి రోజు 5వేల 500 మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు వీలుగా టికెట్లు జారీ చేయనున్నారు. ఇలా కొండపై భక్తుల సంఖ్యతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.