శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. తొలిసారి ఏకాంతంగా..!

  • Published By: sreehari ,Published On : September 18, 2020 / 07:49 PM IST
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. తొలిసారి ఏకాంతంగా..!

Tirumala Srivari Brahmotsavam: ఏడాదికోసారి జరిగే మహా ఉత్సవాలకు తిరుమలేశుడు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రేపట్నుంచి ఈనెల 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కరోనా ప్రభావంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా టీటీడీ నిర్వహిస్తోంది. విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఆలయానికే పరిమితం చేసింది.  27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కరోనా కారణంగా తిరుమల చరిత్రలో మొదటిసారి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండా ఏకాంతంగా జరగనున్నాయి.



శ్రీవారి బ్రహ్మోత్సవాలలో రేపు సాయంత్రం 6 గంటలకు మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనుంది. ఆ తరువాత రాత్రి 8 గంటల30 నిమిషాల నుండి 9గంటల 30 నిమిషాల వరకు పెద్దశేషవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున ప్రధాన ఘట్టమైన గరుడ సేవ జరగనుంది. గరుడ సేవలో స్వామివారు సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంఠి లాంటి విశేష ఆభరణాలను ధరించి గరుడ వాహనంపై ఆశీనులు కానున్నారు.



బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది టీటీడీ. రేపటి నుంచి ఈ నెల 27 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా భక్తులు లేకుండా నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ చెప్పారు. ఈ నెల 23న శ్రీవారి ఆలయంలో గరుడ సేవ ఉంటుందని, అదే రోజున సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. స్వర్ణరథం, మహారథోత్సవం బదులు.. సర్వభూపాల వాహనంపై స్వామివారి దర్శనమిస్తారని టీటీడీ చైర్మన్ పేర్కొన్నారు.



తొమ్మిది రోజుల పాటు ఆ దేవదేవుడే భక్తుల ముందుకు తరలివచ్చి అనుగ్రహించే.. మహాత్తర ఘట్టానికి తిరుమలలో ఎంతో ప్రాధాన్యం ఉంది. యుగయుగాలుగా ఏడుకొండలపై కొలువైన స్వామి వారికి సాక్షాత్తూ బ్రహ్మే ఉత్సవాలు జరిపిస్తారు. అందుకే వీటిని బ్రహ్మోత్సవాలని భవిష్యోత్తర పురాణం చెబుతోంది.