TPT BY Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు!

తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

TPT BY Poll : తిరుపతి బీజేపీ అభ్యర్థి ఖరారు!

Tpt

BJP candidate : తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కర్నాటక కేడర్‌ మాజీ IAS అధికారి రత్నప్రభను ఉపఎన్నిక బరిలో నిలపాలని బీజేపీ నిర్ణయించింది. మరికాసేపట్లో ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గతంలో కర్నాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రత్నప్రభ పని చేశారు. 2018లో ఆమె బీజేపీలో చేరారు. ఏపీలో ఐటీ సెక్రటరీగా కూడా ఆమె పని చేశారు. టీడీపీ, వైసీపీ అభ్యర్ధులను ఆ పార్టీ అధిష్టానాలు ఇప్పటికే ప్రకటించాయి. టీడీపీ నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తిలు ఎన్నికల బరిలోకి దిగనున్నారు.

ఇప్పటికే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదలైంది. 30వ తేదీన నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్‌ నిర్వహిస్తారు. మే 2వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే….ఉప ఎన్నికలో పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాటించడం లేదు. అన్ని పార్టీలూ ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కాషాయ జెండాను రెపరెపలాడించడం…అంత కష్టం కాదన్నది బీజేపీ అభిప్రాయం. అయితే..జనసేన అభ్యర్థి నిలబడుతాడని తొలుత ప్రచారం జరిగింది. ఏ అభ్యర్థి నిలబడితే బాగుంటుందనే దానిపై ఇరు పార్టీలు పలు దఫాలుగా చర్చించాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు రాగా..మూడో పక్షంగా ఉన్న జనసేన- బీజేపీ విషయంలో సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం బీజేపీ పోటీ చేస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

తిరుపతి పార్లమెంటు బరిలో సుమారు 16.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 13.20 లక్షల మంది ఓటేశారు. ఇందులో వైసీపీకి 7.22 లక్షల ఓట్లు రాగా, టీడీపీకి 4.94 లక్షల ఓట్లు వచ్చాయి. 80 శాతం పోలింగ్ జరగగా.. 2.28 లక్షల ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది. మరి ఈ దఫా సీఎం జగన్ కోరుతున్నట్లు 4 లక్షల మెజారిటీ సాధించాలంటే.. పోలింగ్ శాతం పెంచడంతో పాటు మరిన్ని అదనపు ఓట్లు సాధించడమే వైసీపీ ముందున్న లక్ష్యం.