ఆ సంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తారా? తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను రాజధానిపై రెఫరెండమ్‌గా భావిస్తారా?

  • Published By: naveen ,Published On : September 30, 2020 / 01:09 PM IST
ఆ సంప్రదాయాన్ని జగన్ కొనసాగిస్తారా? తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను రాజధానిపై రెఫరెండమ్‌గా భావిస్తారా?

tirupati loksabha by election: తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతుంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఈ ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కబోతుందని అంటున్నారు. ఉప ఎన్నికలో అధికార పార్టీ తన సంప్రదాయాన్ని కొనసాగించబోతుందని చెబుతున్నారు.

సాధారణంగా వైసీపీ ఆవిర్భావం నుంచి ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు చనిపోతే వారి కుటుంబంలోని ఒకరికి టికెట్ ఇస్తూ వస్తున్నారు జగన్‌. ఇప్పటికే అనేక సార్లు ఇలా చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లోనూ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచే ఒకరికి టికెట్ ఇస్తారని చెబుతున్నారు.

ప్రతిపక్షాలు పోటీ చేస్తాయా లేదా?
ఇప్పటికే ఏపీలో పాలిటిక్స్ వేడివేడిగా ఉన్నాయి. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నారు. దీనికి తోడు ఉప ఎన్నిక వస్తే హీట్ పెరగడం ఖాయమంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ కచ్చితంగా దుర్గాప్రసాద్ కుటుంబానికి అవకాశం ఇవ్వనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేస్తాయా.. లేదో చూడాలి. మరోపక్క, తిరుపతి ఉప ఎన్నికను మూడు రాజధానుల నిర్ణయానికి రెఫరెండమ్‌గా ప్రభుత్వం భావిస్తుందా లేదా అనే చర్చ సాగుతోంది.

రాజధాని అంశంపై రెఫరెండమ్‌గా భావిస్తాయా లేదా:
ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న తొలి ఎన్నిక ఇదే కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. ఎప్పుడు జరుగుతాయన్నది ఇంకా తేలడం లేదు. ఈ సమయంలో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధంగా కావాలని సవాళ్లను విసురుతోంది.

కానీ, ప్రభుత్వం మాత్రం విశాఖలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఎన్నికలను ఎదుర్కోవాలని అంటోంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలను వైసీపీ, టీడీపీ రాజధాని అంశంపై రెఫరెండమ్‌గా భావిస్తాయా లేదా అన్న చర్చ ఊపందుకుంది.