తిరుపతి పార్లమెంట్ ఉప పోరు : అప్పుడే ఎన్నికల హడావుడి

  • Published By: madhu ,Published On : November 23, 2020 / 07:34 AM IST
తిరుపతి పార్లమెంట్ ఉప పోరు : అప్పుడే ఎన్నికల హడావుడి

Tirupati Parliamentary by-poll : తిరుపతి పార్లమెంట్ ఉప పోరుతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించి మిగతా పార్టీలకు టిడిపి సవాల్ విసరగా, అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చి అందరికీ షాక్ ఇచ్చింది వైసిపి. మరోవైపు తమ సత్తా చూపిస్తామని బీజేపీ సవాల్ విసురుతుండగా.. తిరుపతి తమ అడ్డా అంటూ కాంగ్రెస్ సైతం పోటీకి సై అంటోంది. మరి ఈ చతుర్ముఖ పోటీలో గెలిచేది ఎవరు?. సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే పోటీ వద్దన్న నిబద్దతకు అన్ని పార్టీలు తిలోదకాలు ఇస్తూ.. పోటీకి కాలు దువ్వుతున్నాయి.



ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపించకున్నా :-
ఇందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఆ లెక్కన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధమైపోయాయి. నిజానికి ఈ ఏడాదిలో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపించకున్నా… రాజకీయ వాతావరణం మాత్రం అప్పుడే వేడెక్కింది. పార్టీ సాంప్రదాయాలకు భిన్నంగా టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఓ అడుగు ముందుకేసి ఈ దఫా అందరికన్నా ముందుగా అభ్యర్థిని ప్రకటించారు. గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని మళ్లీ బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించారు. అధికార వైసీపీ విషయానికొస్తే సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటామన్న ధీమా ఆ పార్టీలో మొదటి నుంచి ఉంది.



డాక్టర్ శివమూర్తి :-
బల్లి కుటుంబం నుంచి ఒకరు వైసీపీ తరపున బరిలో ఉంటారని… అందులోనూ ఆయన కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి పేరే ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అయితే ఇంతలో ఏం జరిగిందో కానీ అనూహ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా.. వైఎస్ జగన్ కుటుంబ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివమూర్తి తిరుపతి అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇది వరకు రెండు మార్లు టిడిపితో జతకట్టి తిరుపతి పార్లమెంట్ స్థానంపై బిజెపి కాషాయ జెండా ఎగరేసింది. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పార్టీలో గెలుపు ధీమా కనిపిస్తోంది. జనసేనతో కలిసి బిజెపి ఇక్కడ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ సైతం తిరుపతి ఉప పోరుకు సై అంటోంది.



https://10tv.in/class-8-students-to-attend-school-from-november-23/
ఎన్నికల హడావుడి :-
నిజానికి ఒకప్పుడు తిరుపతి లోకసభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఆ పార్టీ తరఫున డాక్టర్ చింతామోహన్ పలుమార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే బరిలో నిలపాలని ఆ పార్టీ భావిస్తోంది. నిజానికి తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ ఖాతాలోనే ఉండటంతో గెలుపుపై ఆ పార్టీ ధీమా ఉంది. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని.. ప్రజల్లోని ఆ అసమ్మతి, అసంతృప్తి తమను గెలిపిస్తాయని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి. తిరుపతి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… పార్టీల్లో మాత్రం ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది.