TPT, Nagarjuna Sagar By Poll : అక్కడ తిరుపతి, ఇక్కడ నాగార్జున సాగర్..ప్రచార హోరు..మాదంటే మాదే గెలుపంటున్న నేతలు

TPT, Nagarjuna Sagar By Poll : అక్కడ తిరుపతి, ఇక్కడ నాగార్జున సాగర్..ప్రచార హోరు..మాదంటే మాదే గెలుపంటున్న నేతలు

By Poll

Election campaign : తెలంగాణలో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్లు ముగియడంతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు. ఎవరికి వారే ధీమాతో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఒకరిపై ఒకరు పదునైన విమర్శలు గుప్పిస్తూ.. క్యాంపెయిన్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున జానారెడ్డి, టీఆర్ఎస్‌ అభ్యర్థిగా నోముల భగత్‌ … బీజేపీ అభ్యర్థి రవినాయక్‌ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయన్నారు ఆ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌. సీఎం కేసీఆర్‌ తనకు బీఫాం ఇచ్చి బలపర్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సాగర్‌లో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు.

ఇటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సాగర్‌ నియోజక అభ్యర్థి జానారెడ్డి కూడా తన గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఓటరుకు స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. భారత దేశంలోనే ప్రయోగాత్మకంగా నామినేషన్స్ వేసి ప్రచారాలకు పోకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ముందుకు వస్తే తమ పార్టీని ఒప్పిస్తానని సవాల్ విసిరారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థి రవినాయక్‌ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రెండు ఎకరాలతో మొదలైన జానారెడ్డి ఆస్తులు వేల కోట్లకు ఎలా చేరాయని ప్రశ్నించారు రవి నాయక్. నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా వున్నప్పుడు వాళ్ళ బావమరిది పెత్తనం చేశాడని… ఇప్పుడు భగత్ గెలిస్తే అదే పరిస్థితి రిపీట్ అవుతుందని ఆరోపించారు.
ఇక ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు, ఆ పార్టీల ముఖ్య నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తూ… పొలిటికల్‌ హీట్‌ పుట్టిస్తున్నారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్థానంలో ఎలాగైనా గెలువాలని బీజేపీ, టీడీపీ ప్రయత్నం చేస్తుంటే… భారీ మెజార్టీనే టార్గెట్‌గా వైసీపీ పై ఎత్తులు వేస్తోంది. ప్రతీ ఓటు కీలకం కావడంతో.. బీజేపీకి జనసేన సపోర్ట్‌ కీలకంగా మారింది. పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా.. జనసైనికులను ప్రసన్నం చేసుకుంది కమలం పార్టీ. ఇక టీడీపీ మాత్రం వైసీపీ పరిపాలనలో దౌర్జన్యాలు జరిగాయంటూ ప్రచారం చేస్తోంది. ప్రత్యేక హోదా తేవడంలో విఫలమైన వైసీపీకి ఓటు వేయవద్దంటూ కోరుతుంది. ఇక వైసీపీ మాత్రం తమ పరిపాలన.. సంక్షేమ కార్యక్రమాలనే ప్రచారాస్త్రాలుగా మార్చుకుంది. మున్సిపల్ ఎన్నికల్లానే అభివృద్ధిని చూసే.. తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లోనూ జనం ఓట్లేస్తారంటున్నారు అధికార పార్టీ నేతలు.

మరోవైపు.. తిరుపతి ఎన్నికల ప్రచారంలో కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నాయి అన్ని పార్టీలు. తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కాంగ్రెస్‌లో ఉండగా చేసిన వ్యాఖ్యలను బయటపెట్టి చంద్రబాబుకు షాకిచ్చారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అటు.. బీజేపీ తీరుపై సెటైర్లు వేస్తున్నారు టీడీపీ, వైసీపీ నేతలు.