తెలంగాణలో నేడు,రేపు వర్షాలు

  • Published By: murthy ,Published On : November 25, 2020 / 07:19 AM IST
తెలంగాణలో నేడు,రేపు వర్షాలు

Today, tomorrow rains in telangana : బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హైదరబాద్ లోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల బుధ, గురు వారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారుతెలిపారు.

వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తం గా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మంగళవారం ఆదేశించారు. వర్షాల ప్రభావం ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.



పెరుగుతున్న చలి
ఏజెన్సీ ప్రాంతాల్లో గత 2 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రత లు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
https://10tv.in/nivar-storm-heavy-rain-forecast-for-ap-telangana/
ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి 7 గంటల నుంచే మంచు కురుస్తోంది. కాగా, ‘నివర్‌’ తుఫాను ధాటికి తమిళనాడు, పుదుచ్చేరిల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. బుధ, గురువారాల్లో ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఆంధ్రప్రదేశ్ లో
మరో వైపు ఏపీలో ‘నివర్‌’ తుపాను నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.



ఐఎండి సూచనల ప్రకారం తీవ్ర తుపానుగా మారిన నివర్ తుపాను కడలూర్ కి తూర్పు ఆగ్నేయం 300 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. బుధవారం సాయంత్రానికి తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉంది.

తుపాను  తీరందాటే సమయంలో దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ తెలిపింది,నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సహాయక చర్యలకోసం  ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం సిద్దంగా ఉంచింది.



తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.  రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.