TTD : రూ. 300 కోట్ల విరాళం, ఉద్వేగ్ ఇన్ ఫ్రా ఆర్థిక స్థితిగతులపై ఆరా తీయాలన్న టీటీడీ ఛైర్మన్

TTD : రూ. 300 కోట్ల విరాళం, ఉద్వేగ్ ఇన్ ఫ్రా ఆర్థిక స్థితిగతులపై ఆరా తీయాలన్న టీటీడీ ఛైర్మన్

Ttd

Udveg Infra : టీటీడీకి 300 కోట్ల విరాళం ఇచ్చేంత స్తోమత ముంబైకి చెందిన ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఉందా.. అనే అంశంపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలపై టీటీడీ ఛైర్మన్ స్పందించారు. ఉద్వేగ్ ఇన్‌ఫ్రా ఆర్ధిక స్ధితిగతులపై ఆరా తీయాలని విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించారు. పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి రూ. 300 కోట్ల విరాళంతో టీటీడీతో MOU చేసుకుంది ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ. అయితే ఆ సంస్థ ఆర్ధిక స్ధితిగతులను 10టీవీ ప్రశ్నించింది. లక్ష రూపాయల మూలధనం ఉన్న కంపెనీ 300కోట్ల విరాళం ఇవ్వగలదా అని నిలదీసింది. 10టీవీ లేవనెత్తిన అంశాలపై స్పంచిందిన టీటీడీ ఛైర్మన్.. భక్తుడిగా అతను చెప్పిన మాటలు విన్నామన్నారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని 300 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ముంబైకి చెందిన ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకొచ్చిందంటూ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం- టీటీడీ చేసిన ప్రకటన భక్తజనావళిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఎందుకంటే.. 300 కోట్ల రూపాయలంటే మాటలు కాదు.. బహుశా విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణ దేవరాయులు ఏనాడో చేసిన దానాలను మినహాయిస్తే.. టీటీడీకి ఈ స్థాయిలో దానం ఇచ్చేందుకు ముందుకొచ్చింది ఉద్వేగ్ సంస్థ అధినేత మాత్రమే.

ఉద్వేగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ డైరెక్టర్‌ సంజయ్ కేదార్‌నాథ్ సింగ్‌తో రూ. 300కోట్ల విరాళంతో పిల్లల ఆస్పత్రి నిర్మించేందుకు శుక్రవారం MOU కూడా కుదుర్చుకున్న టీటీడీ సంస్థ.. ఇందుకు సంబంధించి కనీస కసరత్తు చేసి సాధ్యాసాధ్యాలను అసలు పరీశిలించిందా అనే అనుమానం వస్తోంది. పైగా ఆస్పత్రి నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చేందుకు టీటీడీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… టీటీడీ ఈవో కూడా ఇవాళ వెళ్లి ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఏ స్థలాన్ని కేటాయించొచ్చు అన్నదానిపై పరిశీలన జరిపారు.

టీటీడీ పిల్లల ఆస్పత్రికి 300 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి, ఏకంగా MOU కుదుర్చుకున్న ముంబై భక్తుడు సంజయ్‌ కేదార్‌నాథ్ సింగ్‌కు నిజంగా అంత ఆర్థిక శక్తి ఉందా..? ఇదంతా కలా.. వైష్ణవ మాయా..? లేదా కలియుగ వైకుంఠనాథుడి మహిమా..? కాలమే సమాధానం చెప్పాలి. ఈ భారీ విరాళం నిజమవుతుందా లేదా అనే విషయాన్ని టీటీడీనే తేల్చాలి.