Ramana Deekshitulu : సీఎం జగన్ సాక్షాత్తూ విష్ణు స్వరూపుడు, రమణదీక్షితులు ప్రశంసల వర్షం

Ramana Deekshitulu : సీఎం జగన్ సాక్షాత్తూ విష్ణు స్వరూపుడు, రమణదీక్షితులు ప్రశంసల వర్షం

Ramana Deekshitulu

Ramana Deekshitulu Praises CM Jagan : ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. జగన్ ను విష్ణుమూర్తితో పోల్చారాయన. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వేంకటేశ్వరుడి అనుగ్రహంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారని రమణదీక్షితులు అన్నారు.

మంగళవారం(ఏప్రిల్ 6,2021) తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ను రమణదీక్షితులు కలిశారు. అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సీఎం జగన్‌ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాం. పింక్‌ డైమండ్‌ మాయం అంశం కోర్టులో ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగట్లేదు. దేవస్థానం విషయాలను రాజకీయం చేయడం తగదు” అని అన్నారు.

పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో, రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు.

65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి తీర్మానించింది. దీనికి అనుగుణంగా అప్పటి టీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతోపాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.

కాగా, ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు కోర్టుని ఆశ్రయించారు. వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ 2018 డిసెంబర్ లో హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో రమణదీక్షితులు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ ని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అధికారంలోకి వస్తే ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును తిరిగి నియమిస్తామని జగన్‌ నాడు హామీ ఇచ్చారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో ఎంఎస్‌ నంబర్ 439 ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రమణదీక్షితులుతోపాటు 14 మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరారు.

సీఎం జగన్ ను ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను రమణదీక్షితులు అందజేశారు. ఇతర అర్చకులు కూడా సీఎంను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.