Tirumala : టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు-20 రోజుల్లో రూ.100 కోట్ల పైగా ఆదాయం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  వారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.   

Tirumala : టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు-20 రోజుల్లో రూ.100 కోట్ల పైగా ఆదాయం

Ttd Parakamani Seva

Tirumala :  కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  వారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది.   జులై నెలలో  టీటీడీలో  శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో చరిత్ర సృష్టించింది. శ్రీవారి భక్తులు కోనేటి రాయుడికి జులై నెలలో కాసుల వర్షం కురిపించారు. ఈనెల శ్రీవారి ఆదాయం రూ. 100 కోట్ల మార్క్‌ను దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు.

మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరుగుతోందని అధికారులు తెలిపారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల కొండ  భక్తులతో కిటకిటలాడుతోంది.   జులై 1వ తేదీనుంచి జులై 21వ తేదీ వరకు శ్రీవారికి హుండీ ద్వారా 100 కోట్ల 75 లక్షల ఆదాయం వచ్చింది. టీటీడీ చరిత్రలో అత్యధిక ఆదాయం ఈనెలాఖరులోపు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు గత మే నెలలో వచ్చిన 130 కోట్ల రూపాయలే అత్యధిక ఆదాయం కాగా… జులై 31 నాటికి 140 కోట్ల రుపాయలు  వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గత ఐదు   నెలలుగా స్వామివారి ఆదాయం 100 కోట్ల మార్కును దాటి ఆదాయం వస్తోందని అధికారులు వివరించారు. ఈఏడాది మార్చిలో 128 కోట్ల రూపాయలు… ఏప్రిల్ నెలలో 127.5 కోట్లు… మే నెలలో 130.05 కోట్లు.. జూన్ లో 123 కోట్ల రూపాయలు  ఆదాయం రాగా జులై మాసంలో ఇప్పటికే స్వామి వారి ఆదాయం 100 కోట్ల 5 లక్షలుకు చేరింది.

టీటీడీ చరిత్రలో ఈ జులై నెల4 వతేదీన అత్యధికంగా రూ. 6.18 కోట్లు ఆదాయం లభించింది. ఈ నెలలో ఇంకో పదిరోజులు హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా కొత్త చరిత్ర సృష్టిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఐదు నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.650 కోట్లను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదాయం 1500 కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.