నీటి వనరుల సంరక్షణలో టీటీడీ జబర్దస్త్ ఐడియా

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 01:21 PM IST
నీటి వనరుల సంరక్షణలో టీటీడీ జబర్దస్త్ ఐడియా

TTD Plans To Use Recycled Water : తిరుమలలో నీటి వనరుల సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వాడుతూనే.. వాడిన నీటిని మళ్లీ పునర్వినియోగంలోకి తీసుకొచ్చే చర్యలను పటిష్టంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం శుద్ధిచేసిన డ్రైనేజీ నీటిని ఉద్యానవనాల కోసమే వాడుతున్నా.. భవిష్యత్తులో కాటేజీలు, అతిథి గృహాల టాయిలెట్స్‌లో వాడాలని టీటీడీ యోచిస్తోంది.



కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను.. లాక్‌డౌన్‌కు ముందు వరకు నిత్యం 70 వేల నుంచి లక్ష మంది భక్తులు దర్శించుకునేవారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమల్లో ఉండడంతో.. కేవలం రోజుకు 27 వేల మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. గతంలో భక్తుల అవసరాల కోసం ప్రతిరోజు 35 నుంచి 40 లక్షల గ్యాలన్ల నీటి వినియోగం ఉండేది.



ఇది కరోనా లాక్‌డౌన్‌కు ముందు మాట. ప్రస్తుతం నీటి వినియోగం ఇందులో సగం కన్నా తక్కువే. అయితే ఇంత భారీ మొత్తంలో నీటి వినియోగం ఉన్న తిరుమలలో నీటి వనరులు ఎన్ని ఉన్నప్పటికీ నీటి నిలువలు వేగంగా తరిగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి టీటీడీ వినూత్న ఆలోచన చేస్తోంది.



https://10tv.in/good-news-to-tirumala-srivari-devotees/
సాధారణంగా ఓసారి వాడిన నీటిని మళ్లీ వాడాలంటే సాధ్యం కాదు. అయితే టీటీడీ మాత్రం వాడిన నీటిని శుభ్రం చేసి తిరుమలలోని ఉద్యానవనాలు, అడవులు పెంచడానికి వినియోగిస్తోంది. అయితే రానున్న రోజుల్లో తిరుమలలోని కాటేజీలు, అతిధి గృహాల్లోని టాయిలెట్లలో నీటిని ఫ్లష్ చేయడానికి ఈ ట్రీట్‌మెంట్‌ వాటర్‌ను వినియోగించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.



టాయిలెట్లలో ప్లష్ చేయడానికి వీలుగా ప్రత్యేకంగా పైప్‌లైన్ వేయడానికి సాధ్యాసాద్యాలు పరిశీలిస్తున్నారు. టిటిడి ఈవో జవహర్ రెడ్డి సైతం ఈ ప్లాంట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యానవనాలు, టాయిలెట్లకు ట్రీట్‌మెంట్‌ వాటర్ వినియోగం కారణంగా ప్రధాన నీటి వనరులు వృధా అయ్యే సమస్య ఉండదు.



డ్రైనేజీ నీటిని శుద్ధి చేయడానికి 1991 నుంచి తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 4 నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాపవినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక, గోగర్భం, బాలాజీ నగర్‌కు దిగువన ఒకటి, టీబీసీ ఏరియాలో ఒకటి మొత్తం నాలుగు ప్లాంట్లు ఉండగా.. కొత్తగా మరో మూడు ప్లాంట్ల నిర్మించనున్నారు.



మొత్తం ప్లాంట్‌ల నిర్మాణం పూర్తయితే టీటీడీకి ప్రతిరోజు 14 MLD నీటిని శుద్ధి చేసే సామర్ద్యం ఉంటుంది. బెంగళూరుకు చెందిన గ్నోసీ టెక్ అనే సంస్థ ఈ ప్లాంట్‌ల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఇందుకోసం టీటీడీ ప్రతి ఏటా 7 లక్షల వరకు సంస్థకు చెల్లిస్తోంది. ఇందులో పనిచేసే కార్మికుల జీతభత్యాల బాధ్యతతో పాటు.. నీటిని శుద్ధి చేసే కెమికల్స్ తదితరాలను కంపెనీయే సమకూర్చుంటోంది. ఇక నీటి వనరులు వృధా కాకుండా తీసుకుంటున్న చర్యలతో.. టీటీడీ ప్రశంసలు అందుకొంటోంది.