TTD Kalyanamasthu : ‘కళ్యాణమస్తుకు’ టీటీడీ మళ్ళీ శ్రీకారం…ఒక్కటయ్యే జంటలకు బంగారు తాళిబొట్టు

దశాబ్ధకాలంగా నిలిచిపోయిన 'కళ్యాణమస్తు'కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది.

TTD Kalyanamasthu : ‘కళ్యాణమస్తుకు’ టీటీడీ మళ్ళీ శ్రీకారం…ఒక్కటయ్యే జంటలకు బంగారు తాళిబొట్టు

Ttd

TTD restart Kalyanamasthu : దశాబ్ధకాలంగా నిలిచిపోయిన ‘కళ్యాణమస్తు’కు టీటీడీ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. వైకుంఠనాథుని సాక్షిగా ఒక్కటయ్యే జంటలకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టును అందించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ మహోన్నత కార్యక్రమానికి సుముహూర్తం ఖరారు చేసింది. కళ్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం టీటీడీ ట్రెజరీలో సిద్ధంగా ఉన్న 20వేల తాళిబొట్లను వినియోగించుకోనుంది.

శ్రీవారి సమక్షంలో పేద హిందువులు వివాహం చేసుకునేలా 2007లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్రంలో కళ్యాణమస్తు ఘనంగా నిర్వహించేవారు. కలియుగ ప్రత్యక్షదైవం ఆశీస్సులు ఉంటాయనే భావనతో వేలాది జంటలు ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వాములయ్యేవి. ఈ సందర్భంగా వధూవరులకు టీటీడీ తరఫున నూతన వస్త్రాలు, బంగారు తాళిబొట్టును అందించడమే కాకుండా 50 మంది బంధువులకు భోజనాలను వితరణ చేసేవారు.

2007 నుంచి 2011 వరకు ఏటా రెండు విడతలుగా కళ్యాణమస్తును నిర్వహించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం నిలిచిపోయింది. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కళ్యాణమస్తును పునఃప్రారంభించాలని నిర్ణయించారు. మే 28, అక్టోబర్‌ 30, నవంబర్‌ 17వ తేదీల్లో కళ్యాణమస్తు నిర్వహిస్తామని ఈఓ జవహర్‌ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఎక్కడ కార్యక్రమాలను జరిపించాలో పాలకమండలి సమావేశంలో నిర్ణయించనున్నారు.