గోవిందా..గోవిందా : సర్వదర్శనం టోకెన్ల వివాదం, తోపులాట

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 10:59 AM IST
గోవిందా..గోవిందా : సర్వదర్శనం టోకెన్ల వివాదం, తోపులాట

TTD Sarva Darshan Token Controversy : తిరుమల కొండపై శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల వివాదం నెలకొంది. శనివారం జారీ చేయాల్సిన టికెట్లను శుక్రవారం రాత్రే అధికారులు జారీ చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం టికెట్ల కోసం వచ్చిన భక్తులను వెనక్కి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి 12 గంటలకు ఇస్తామని, ఇక్కడ ఉండవద్దని చెబుతున్నారని అప్పటి వరకు రోడ్లపై ఉండాలా ? అని ప్రశ్నిస్తున్నారు. టిటిడి ప్రతి రోజు మూడు వేలు ఉచిత సర్వదర్శన టోకెన్లను తిరుపతి భూదేవి కాంప్లెక్స్ ప్రత్యేక కౌంటర్లలో జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.



శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం అలిపిరి భూ దేవి కాంప్లెక్స్ వద్దకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. భారీగా భక్తులు రావడంతో రోజుకు మూడు వేల టికెట్లు జారీ చేయాల్సిన అధికారులు నిబంధనలు పక్కకు పెట్టేశారు. 2020, అక్టోబర్ 30వ తేదీ శుక్రవారం ఇవ్వాల్సిన మూడు వేల టికెట్లు ఇచ్చేయడంతో పాటు…అక్టోబర్ 31వ తేదీ శనివారం ఇవ్వాల్సిన టికెట్లను (3 వేలు) కూడా ఇచ్చేశారు. ఈ విషయం ఇతర భక్తులకు తెలియదు.



https://10tv.in/rs-15-thousand-controversy-called-to-the-bar-and-stabbed-in-guntur-dist-tenali/
శనివారం ఉదయం టికెట్ల కోసం భక్తులు తరలివచ్చారు. వారెవరిని టీటీడీ సెక్యూరిటీ అనుమతించడం లేదు. రోడ్డుపైనే భక్తులను ఆపివేస్తున్నారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమాచారం తెలియకపోవడంతో.. భక్తులు తెల్లవారుజాము నుంచే సర్వదర్శనం టోకెన్ల కోసం పడిగాపులు పడుతున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులను ఈరోజు రాత్రి 12 గంటలకు తిరిగి రావాలని టీటీడీ సిబ్బంది పంపుతున్నారు. దీంతో టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



రాత్రి 12 గంటలకు టోకెన్లు ఇస్తామని చెబుతున్నారని, అంతవరకు తాము ఎక్కడ గడపాలని భక్తులు ప్రశ్నిస్తున్నారు. కనీసం తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేదని తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు. శుక్రవారం రాత్రే ఆరు వేల టికెట్లు ఇచ్చేశారని, టోకెన్లు ఇస్తారని తాము భావించి ఇక్కడకు వచ్చామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల పట్ల టిటిడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.