TTD Trust Board Meeting : తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం

టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.

TTD Trust Board Meeting : తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం

Ttd Trust Board Meeting Today At Tirumala

TTD Trust Board Meeting : టీటీడీ పాలక మండలి ఈరోజు తిరుమలలో సమావేశం అవుతోంది. సుమారు 16 నెలల విరామం తరువాత పూర్తి స్థాయి పాలకమండలి నేడు సమావేశం కానుంది. ఈనెల 21 తో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగే ఈ సమావేశంలో దాదాపు 85 అంశాలతో ఎజెండా రూపోందించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ముఖ్యంగా గరుడ వారధిని అలిపిరి వరకు విస్తరించటం అందుకు నిధుల కేటాయింపు పై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు కళ్యాణమస్తు, మారుమూల ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంపై పాలక మండలిలో చర్చించనున్నారు. కరోనా తీవ్రత తగ్గుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల కల నెరవేర్చేలా హోసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఇంటి స్థలాలు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీలోని పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులను శాశ్వత పోస్టులుగా గుర్తించాలని, దీనిపై సుదీర్ఘ చర్చ జరిపి నిర్ణయం తీసుకోనుంది.

టీటీడీ ఆస్పత్రుల్లో మందులు కొనుగోళ్లపై చర్చ జరుగనుంది. టీటీడీ విద్యాసంస్థల్లో హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేసే అంశంపై కూడా చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో త్వరలో 500 ఆలయాల నిర్మాణం చేపట్టాలనే అంశంపై సమావేశంలో చర్చిస్తారు.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన కళ్యాణ మస్తు సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పునః ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నా కోవిడ్ కారణంగా అమలు చేయలేకపోయారు. ఆఅంశంపైనీ నేటి సమావేశంలో చర్చించనున్నారు.

అంతేకాకుండా భద్రతను మరింత పటిష్టం చేసేందుకు మూడో దశలో రూ.16 కోట్ల ఖర్చుతో తిరుమలలో 1389 సీసీ కెమెరాల ఏర్పాటుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసి బోర్డుకు సమర్పించారు. దీనిపై కూడా నిర్ణయం తీసకునే అవకాశముంది. తిరుమలలోని పవన విద్యుత్ కేంద్ర నిర్వహణను హైదరాబాద్ కు చెందిన గ్రీన్ కో సంస్థకు అప్పగించేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పేరూరులోని వకులామాత ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు రూ.2.90 కోట్లను శ్రీవాణి ట్రస్టు నిధుల నుండి కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. తిరుమల భద్రతకు తలపెట్టిన కంచె నిర్మాణంలో భాగంగా మూడో దశ నిర్మాణ పనులకు రూ.7.37 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.

గత ఏడాదిన్నర కాలంగా కోవిడ్ వల్ల జన జీవనం ఇబ్బందిగా తయారైనా, టీటీడీ తరపున అనేక కార్యక్రమాలు నిర్వహించామని చైర్మన్ వైవీ సుబ్బరెడ్డి తెలిపారు. ప్రపంచ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండేలా ఆశీస్సులు అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాట పర్వం పారాయణం నిర్వహించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించే అంశం కూడా ఈరోజు జరిగే సమావేశంలో చర్చిస్తామని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.