తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

  • Published By: murthy ,Published On : November 20, 2020 / 01:19 PM IST
తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

tungabhadra pushkaralu starts : ‘పుష్కరాలు’ అంటేనే భారతీయ భక్తులకు గొప్ప పండుగ. ఇక, తమ సమీప ప్రాంతాల్లోని నదికి పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరోత్సవాలైతే అక్కడి తీరప్రాంత భక్తుల హృదయాలనిండా భక్తి పారవశ్యాన్ని, ఆనందాన్ని నింపుతాయి. ఈ ఏడాది శ్రీ శార్వరి నామ సంవత్సర కార్తీక శుక్ల షష్ఠి శుక్రవారం (20వ తేది) తుంగభద్రా నదికి పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించే అత్యంత పుణ్య సమయమిది. ఈ 12 రోజులూ ఆ నదీమతల్లికి వేడుక.

ఈ రోజు మధ్యాహ్నం 01:21 కు పుష్కరుడు మకర రాశి ప్రవేశంతో తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభంఅవుతున్నాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కరాలను కర్నూలు లో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లో మధ్యాహ్నం గం. 01:21 కు ప్రారంభించారు.



జల్లు స్నానంతో పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. తాడేపల్లి నుంచి బయలు దేరిన సీఎం జగన్ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ వరకు విమానంలో, అక్కడి నుంచి కర్నూలు ఏపీఎస్పీ గ్రౌండ్ కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడినుంచి తుంగభద్రా నది వరకు కారు లో వచ్చి…. పుష్కర స్నానం అయిన వెంటనే ఆయన తిరిగి తాడేపల్లి వెళ్లనున్నారు.

12 రోజులపాటు జరిగే ఈ పుష్కరాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉదయం గం.6 నుంచి సా 5గంటల వరకే పుష్కరాల నిర్వహణకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. పదేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, వృద్దులు పుష్కరాలకు రావొద్దని సూచించింది.



కర్నూలులో పుష్కరాల కోసం 23 ఘాట్లు ఏర్పాటు చేశారు. అటు మంత్రాలయంలోనూ ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించేలా ప్రత్యేక బృందాలు రెడీ చేశారు. కరోనా నెగిటివ్‌ రిపోర్టు ఉంటేనే ఘాట్లలోకి అనుమతి ఇస్తున్నారు.
https://10tv.in/tirupati-byelection-ysrcp-candidate-doctor-guru-murthy/
జ్యోతిష, ఖగోళ శాస్ర్తాలతో ముడిపడిన 33 కోట్ల దేవుళ్ళ పండుగే పుష్కరాలు. గ్రహ గమనంలో బృహస్పతి (దేవతల గురువు) ఏడాదికోసారి ఒకో రాశిలోకి మారుతుంటాడు. పన్నెండు రాశుల్లో పన్నెండేండ్లు వరుసగా కొలువై ఉంటాడు. ఏ సంవత్సరం ఏ రాశిలో ఉంటాడో ఆ నదికి ఆ ఏడాది పుష్కరోత్సవాలు జరుపుకుంటాం.



పుష్కరాలు తొలి పన్నెండు రోజులు వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత ఆ ఏడాదిపాటు సాధారణంగానైనా ‘పుష్కర వేడుక’ను జరుపుకోవటం సనాతన సంప్రదాయం. ఈ క్రమంలోనే ఈ ఏడాది తుంగభద్ర నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి.

శ్రీ వరాహ సంభూతే తుంగభద్రా మహానదీ
విష్ణుప్రియ నమస్తుభ్యం పంపాదేవస్య వల్లభే
సర్వపాపహరే దేవీ భక్తాభీష్ట ప్రదాయినీ
మకరగతే దేవగురౌ తుంగభద్రా నమోస్తుతే ॥

‘గంగాస్నానం తుంగపానం’ అన్నది లోకోక్తి. ‘నర్మదా యాంతపః కుర్యాత్‌ వారణా స్యాంతనుం త్యజేత్‌ దానందద్యాత్‌ కురుక్షేత్రేలభేత్‌ మోక్షపదం త్రయేత్‌ త్రివిధం తుంగభద్రాయాం అధికం లభతేన్నరః దృష్ట్యాస్పృశ్యా జలం పీత్వా మకర యుక్తే బృహస్పతీ’ అన్నది పురాణ కథనం. నర్మదాతీరంలో తపస్సు, గంగలో మరణం, కురుక్షేత్రంలో దానం.. ఈ మూడిటివల్ల ఎంత పుణ్యమైతే వస్తుందో, మకరంలో బృహస్పతి కొలువైన వేళ తుంగభద్ర నీరు తీర్థంగా స్వీకరిస్తే అంతటి విశేష ఫలం లభిస్తుంది.



‘మకరరాశి గతే జీవే తుంగభద్రా నదీస్నానం దానంతథా క్షౌరం త్రికోటి కులముద్ధరేత్‌’. ‘మానవజన్మ దాల్చినందుకు పంచభూతాల ఆరాధన, వాటిని దేవతలుగా భావించి పూజించటం తప్పనిసరి. ఇదే మన జీవన్ముక్తికి మూలం’ అనీ వేద సంస్కృతి భావన. ధర్మాలను, ప్రకృతిని మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడుతాయి.

దేవతలు దిగి వచ్చే వేళ!
గంగమ్మను తలపై ధరించిన శివునికి అష్టమూర్తిత్వ శక్తులలో ఒకటి ‘జల లక్షణం’. ఒక కథనం ప్రకారం ‘తుందిలుడ’నే వేద పండితుని వృత్తాంతాన్ని ఈ సందర్భంగా ఉటంకిస్తారు. ఎంతో మొండివాడైన ఆ బ్రాహ్మణ యువకుడు ‘లోక కల్యాణానికి, భూమిపై మహత్వ సిద్ధికోసం జలాలను పూజించే అవకాశం ఇవ్వాలని’ బ్రహ్మకోసం పన్నెండేండ్లు తీవ్ర తపస్సు చేశాడు.



బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘తుందిలుని తామర కమలం(పద్మం)గా మార్చేసి, తన కమండలంలో వుంచుకొని, శివుని వద్దకు వెళతాడు. ‘వజ్రనాభుడ’నే రాక్షసుడు తనకు ఏ జీవితోనూ చావు లేకుండా, ఒక్క పద్మంతో మాత్రమే చావు పొందేలా’ అప్పటికే వరం పొంది వున్నాడు. నిరంతరం అరాచకాలు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుంటాడు. బ్రహ్మదేవునికి ఇది జ్ఞాపకం వచ్చి వెంటనే తన కమండలంలోని పద్మాన్ని రాక్షసునిపై వేస్తాడు.

దాంతో ఆ రాక్షసుడు ప్రాణాలు కోల్పోతాడు. అప్పట్నుంచీ బ్రహ్మ ‘తుందిలుని’ పేరును ‘పుష్కరుని’గా మారుస్తాడు. తగిన శక్తినీ ప్రసాదిస్తాడు. శివానుగ్రహంతో ‘ఏడాది కోసారి పుష్కరుడు ఒక నదిలో ఉండేలా, ఆ నదికి 33 కోట్లమంది దేవతలు వచ్చేలా’ వరమిస్తాడు.



‘తీర్థౌషధీ విశేషయోః పుష్కరః’ అని ఆధారాలూ వున్నాయి. లోకాచారం ప్రకారం పన్నెండు ప్రముఖ నదీమ తల్లులకు పుష్కరుడు వరుసకు సోదరుడు అవుతాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తే గంగానదిలో పుష్కరుడుంటాడు. ఇలా, 12 ఏండ్లు 12 నదులతో పుష్కరుడు ఏడాదికి ఒకటి చొప్పున ఒక్కో నదీమతల్లి (అక్క) ఇంట్లో నివాసం వుంటాడు. ప్రస్తుతం, ఈ క్రమంలోనే మకరంలోకి గురువు ప్రవేశించటంతో ‘తుంగభద్ర పుష్కరాలు’ జరుగుతున్నాయి.