నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు…కరోనా నెగిటివ్‌ వస్తేనే అనుమతి..నదీ స్నానాలకు బ్రేక్

  • Published By: bheemraj ,Published On : November 20, 2020 / 07:32 AM IST
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు…కరోనా నెగిటివ్‌ వస్తేనే అనుమతి..నదీ స్నానాలకు బ్రేక్

Tungabhadra pushkars : తుంగభద్ర నదికి పుష్కర శోభ వచ్చింది. 12రోజుల పండుగకు నదీమ తల్లి ముస్తాబైంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట 23 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వేళ నదీ స్నానాలకు బ్రేక్‌ పడింది. పిండ ప్రదానం, పూజా కార్యక్రమాలకే ప్రభుత్వం అనుమతిచ్చింది.



పుష్కరాల కోసం తుంగభద్రనది సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబర్‌ 1 వరకు తుంగభద్ర పుష్కరాలుకొనసాగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో అలంపూర్‌ ఘాట్‌ దగ్గర మధ్యాహ్నం 1.23కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు.. తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్‌ పీఠాధిపతి కమలానంద భారతి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఇక ఏపీ సీఎం జగన్‌.. కర్నూలులోని సంకల్‌భాగ్‌ పుష్కర ఘాట్‌లో తుంగభద్ర పుష్కరాలను ప్రారంభిస్తారు.



గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని, తుంగభద్ర నదీ జలాలు తాకితే సర్వ రోగాలు మాయమవుతాయని పెద్దలు చెబుతారు. అందుకే గంగా స్నానం.. తుంగా పానం అన్న నానుడి వచ్చింది. సాధారణంగా పుష్కరాలంటే నదీ స్నానాల సందడి ఉంటుంది. ఈసారి కరోనా కారణంగా పుణ్యస్నానాలకు అంతరాయం ఏర్పడనుంది.



https://10tv.in/why-did-the-telangana-bjp-not-want-to-be-friends-with-the-janasena/
పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ. 2.5 కోట్లు విడుదల చేసింది. ఈ పుష్కరాలను సాధ్యమైనంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే కరోనా మాత్రం పుష్కరాలకు అడ్డంకిగా మారింది.వేలాది మంది గుమికూడే అవకాశం ఉండటం, నదిలో బృందాలుగా స్నానాలు ఆచరించడం వల్ల కరోనా వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా నదీ స్నానాలను ప్రభుత్వం నిషేధించింది. కేవలం పిండ ప్రదానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది.



తుంగభద్ర పుష్కరాల్లో పిండ ప్రధానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించే పురోహితులు సైతం కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పుష్కరాల్లో పాల్గొనే పండితులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ వస్తేనే వారిని అనుమతిస్తారు. ఒక్కో పుష్కర ఘాట్‌లో 15 మంది పురోహితులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వీరందరికీ గుర్తింపులు కార్డులు ఇస్తోంది ప్రభుత్వం.



ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహించే తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఘాట్‌లకు రహదారులు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతులు తదితరాల కోసం సుమారు 230కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 23 ఘాట్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు ఘాట్‌ల్లో పుణ్యస్నాలు ఆచరించడాన్ని నిషేధించింది.



అయినా భక్తులు గుమికూడే ప్రమాదం ఉన్నందున ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించినట్లు మొదట ప్రకటించారు. వైబ్‌సైట్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారిని మాత్రమే ఘాట్‌లలోకి అనుమతిస్తామని తెలిపారు. భక్తులు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో వెబ్‌సైట్లో స్లాట్ల బుకింగ్‌ను నిలిపేశారు.



ఇక పుష్కరాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలి. ఘాట్‌లోకి ప్రవేశించక ముందే శరీర ఉష్ణోగ్రతలు పరిశీలిస్తారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 12 ఏళ్లలోపు చిన్నారులు, 60ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఇతర జబ్బులతో బాధపడేవారికి అనుమతి లేదు. వచ్చే భక్తులు క్రమశిక్షణతో భౌతిక దూరం పాటిస్తూ పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు.