సడన్‌గా మారిన ఉండవల్లి స్వరం!

  • Published By: sreehari ,Published On : February 27, 2020 / 05:51 AM IST
సడన్‌గా మారిన ఉండవల్లి స్వరం!

ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు, వైసీపీ ఆవిర్భావంతో వైఎస్ కుటుంబానికి, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా రాజకీయ విశ్లేషకుడిగా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే సామాన్య పౌరుడిగా అప్పుడప్పుడూ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటారు. పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టం హామీల విషయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను పదేపదే ఎత్తి చూపించేవారు. అదే సమయంలో అప్పటి ప్రతిపక్షంపై కూడా తనదైన శైలిలో చురకలు అంటించేవారు. 

జగన్‌పై ప్రశంసల జల్లు :
గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపడం, వైఎస్‌కి సన్నిహితుడిగా ఉండటంతో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనుకూలుడనే అపవాదును మూట గట్టుకున్నారు ఉండవల్లి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో రెండు మూడు మీడియా సమావేశాలు పెట్టి తన సలహాలు, సూచనలు అందించిన ఉండవల్లి.. ఆ తర్వాత విదేశీ యాత్రకు వెళ్లిపోయారు. సుమారు నాలుగు నెలల తర్వాత మళ్లీ రాజమండ్రి వచ్చిన ఉండవల్లి… మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్‌పై తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. నవరత్నాలు పూర్తి స్థాయిలో అమలు జరిగితే జగన్ దేశ చరిత్రలోనే నిలిచిపోతారని, ప్రభుత్వంలో ముఖ్యంగా సెక్రటేరియట్‌లో అవినీతి తగ్గిందంటూ కితాబులిచ్చారు. 

ఒకటి రెండు విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ దానిని ప్రభుత్వ అధికారులకు మీదకు నెట్టారు తప్ప ముఖ్యమంత్రి మీదకు వెళ్లనీయలేదు ఉండవల్లి. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్ మీడియా టీంకు ఉండవల్లి మీడియా సమావేశం ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఒక్క ఉండవల్లి మీడియా సమావేశంతో వైసీపీ సోషల్ మీడియా తిప్పికొట్టింది. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదు గానీ ఉండవల్లి ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా స్వరం మార్చారు. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. 

ఇరాకాటంలో వైసీపీ :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఉచిత ఇసుక పాలసీ, ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ, భూ సేకరణ, హైకోర్టు ఏర్పాటు విషయంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వాన్ని కూడా కలవరపాటుకు గురిచేస్తున్నాయట. అధికార పార్టీకి అనుకూలంగా ఉండవల్లి మాట్లాడతారని ఊహించిన వారు ఇప్పుడు షాక్ అయ్యారట. రాజమహేంద్రవరం వేదికగా హైకోర్టుపై కొత్త ఉద్యమానికి తెర లేపడంతో పాటు ఉచిత ఇసుక పాలసీ, ఇళ్ల పట్టాల పంపిణీ భూ సేకరణపై ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వ్యక్తం చేసిన అనుమానాలు వైసీపీని ఇరకాటంలో పెట్టాయని పార్టీలో చర్చించుకుంటున్నారు. 

జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఇప్పుడిప్పుడే అమలుకు నోచుకోవడంతో పాటు వ్యతిరేక ఉద్యమాలు చల్లబడుతున్న తరుణంలో కొత్త నినాదాన్ని తెరపైకి తేవడంతో అధికార పార్టీ నాయకులు రగిలిపోతున్నారట. రాజమహేంద్రవరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలనేది దివంగత సీఎం వైఎస్ఆర్‌ ఆలోచన అంటూ ఆధారాలతో జగన్‌కు లేఖ రాయడంతో, ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. హైకోర్టు కాకపోయినా, బెంచ్ అయినా కేటాయించాలన్న ఉండవల్లి డిమాండ్‌పై జిల్లా ప్రజలు, బార్ అసోషియేషన్ ప్రతినిధులు ఏ విదంగా స్పందిస్తారో అని అధికార పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారట. 

జగన్ ఆదేశాల మేరకే : 
పోలవరం ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగడంతో పాటు కేంద్రం ఇచ్చిన నిధులను అమ్మ ఒడి పధకానికి మళ్లించారన్న ఆరోపణలు ప్రభుత్వ పెద్దలకు ఊపిరి సలపనివ్వడం లేదట. ఈ నేపథ్యంలోనే ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఎప్పుడూ లేనంతగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట.

సౌమ్యుడిగా ఉండే మంత్రి బోస్ ఒక్కసారిగా శివాలెత్తడం వెనుక ఉండవల్లి ఇచ్చిన ఝలక్ కారణమని జిల్లాలో జరుగుతున్న చర్చ. ఉండవల్లి ఎన్ని మాటలు మాట్లాడినా చివరకు ప్రభుత్వ అనుకూలుడే అన్న వాదన కూడా వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ ఆదేశాల మేరకే ఉండవల్లి మాట్లాడి ఉంటారనే అనుమానాలు కూడా ఒక వర్గంలో వినిపిస్తున్నాయట. మరి ఈ వాదనల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే. 

Read More>>ఆ ముగ్గురు ఎంపీలను రాష్ట్ర బీజేపీ నమ్మడంలేదా?