మీ లక్ష్యం పేద ప్రజలే కావాలి, రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సీఎం జగన్ పై ఉండవల్లి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తీరుని, పాలనను ఉండవల్లి

మీ లక్ష్యం పేద ప్రజలే కావాలి, రాజకీయ ప్రత్యర్థులు కాదు.. సీఎం జగన్ పై ఉండవల్లి ఆగ్రహం

ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తీరుని, పాలనను ఉండవల్లి

ఏపీ ప్రభుత్వంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్ తీరుని, పాలనను ఉండవల్లి తప్పు పట్టారు. సీఎం జగన్ వెళ్తున్న దారి కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. దీని వల్ల సీఎం జగన్ కు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఇళ్ల స్థలాల కోసం ఆవ భూముల కొనుగోలు, ఇసుక విక్రయాలు, మద్యం పాలసీ విషయాల్లో సీఎం జగన్ నిర్ణయాలు కరెక్ట్ గా లేవన్నారు ఉండవల్లి.

అధికారం.. ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి కాదు:
మీ లక్ష్యం పేద ప్రజలు కావాలి, కానీ రాజకీయ ప్రత్యర్థులు కాదని ఉండవల్లి హితవు పలికారు. బుధవారం(జూన్ 24,2020) రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఉండవల్లి విమర్శించారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అన్నారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడం ఘోరమైన చర్యగా ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

రూ.80,500 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పంచుతారు?
పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదు.. అధికారంలోకి వచ్చింది పగ తీర్చుకోవడానికి కాదు అని సీఎం జగన్ కు హితవు పలికారు ఉండవల్లి. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోంది… ఎక్కడి నుంచి అంత డబ్బు తెచ్చి ఇస్తారని ప్రశ్నించారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి అన్నారు.

అంత ధరకు ఆవ భూములు కొనడం అవివేకం:
రాజమండ్రిలో ఆవ భూముల కొనుగోలుపై విచారణ జరిపించాలని సీఎం జగన్‌కు లేఖ రాశానని, కానీ తన లేఖను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రూ.45 లక్షలు పెట్టి ఆవ భూములు కొనుగోలు చేశారని, అంత రేటు ఉంటుందని తాను అనుకోవడం లేదని ఉండవల్లి చెప్పారు. పేదలకు పంచి పెట్టడానికి అదే ధరకు ఎక్కడ భూములు ఇచ్చినా కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ప్రకటించారన్నారు. నిబంధనల ప్రకారమే ఆవ భూముల కొనుగోలు జరిగిందని, ఒకే చోట ల్యాండ్ దొరికింది కనుకే త్రీ పర్సెంట్ మాత్రమే అధికంగా చెల్లించామని ఆర్థికశాఖ మంత్రి చెప్పారని ఉండవల్లి తెలిపారు. అయితే తన లెక్క ప్రకారం ఏ రూల్ ప్రకారం చూసినా అంత డబ్బు ఇవ్వటానికి కుదరదని ఉండవల్లి తేల్చి చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యాల్యూ దానిమీద ఎంత పెంచొచ్చు అనేది 2013 యాక్ట్ లో చాలా క్లారిటీగా ఉందన్నారు. మరి వీళ్లు ఏ రకంగా ధర పెంచారో తనకు అర్థం కాలేదన్నారు.

ఇది ప్రభుత్వం అసమర్థత కాదా?
అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పిన సీఎం జగన్.. ల్యాండ్ విషయంలో జరిగిన అవినీతిని ఎందుకు సమర్ధించారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం అసమర్థత కాదా అని నిలదీశారు. అధిక ద‌ర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాన‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం అని అన్నారు. ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌ని, ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని, 15 ఏళ్ల క్రితం కట్టించిన ఇళ్లే ఇంత వరకు పేదలకు ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్:
* ఆవ భూములను ప్రభుత్వం ఎక్కువ ధరకు కొంది
* రూ.45లక్షలు పెట్టి ఆవ భూములు కొనుగోలు చేయడం విస్మయానికి గురి చేసింది
* అధిక ద‌ర‌ల‌కు భూములు కొని, ఇళ్ల ప‌ట్టాలు ఇస్తాన‌న‌టం ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌కు నిద‌ర్శ‌నం
* నాడు ఎన్టీఆర్ కూడా ఇలాంటి పొరపాటే చేశారు
* ఎందుకూ పనికి రాని భూములకు లక్షలు ఇచ్చారు
* ఆవ భూములకు రూ.45లక్షలు ఇవ్వడం విడ్డూరం
* ఆవ భూముల కొనుగోలు వ్యవహారం సీఎం జగన్ కు చెడ్డ పేరు తెస్తుంది
* రాష్ట్రంలో ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది
* ప్రభుత్వ లిక్కర్ పాలసీ అధ్వాన్నంగా ఉంది
* ఏపీ బోర్డర్ లోని రాష్ట్రాల నుంచి మద్యం ఏరులై పారుతోంది
* ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కొనుక్కుని వస్తున్నారు
* మద్యం ధరలు పెంచితే తాగే అలవాటు తగ్గిపోతుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు
* గత ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం కూడా నన్ను పట్టించుకోవడం లేదు
* ఆవ భూముల కొనుగోలుపై విచారణ జరిపించాలని సీఎం జగన్ కి లేఖ రాశాను
* నా లేఖను ఇప్పటివరకు పట్టించుకోలేదు
* ఎక్కువ ధరకు ఆవ భూములు కొని ఇళ్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది
* ఆవ భూములు నేచురల్ గా ఏర్పడినవి
* ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకోవడం నిరుపయోగమైన ప్రతిపాదన
* 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మూడేళ్ల సమయం తీసుకున్నా పర్లేదు, కానీ అది ఉపయోగపడే పద్ధతిలో ఇస్తే మంచిది
* జగన్ కు ఈ ఐడియా ఎవరో ఇచ్చారో కానీ ఇది పూర్తిగా తప్పుడు విధానం
* విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ కలిసి ఉంటే పెద్ద న్యూస్ అయ్యి ఉండేది
* రఘురామ కృష్ణం రాజు నా ఫ్రెండ్, ఆయన గురించి ఏమీ మాట్లాడను
* ప్రభుత్వం నడపటం కన్నా పార్టీని నడపటమే చాలా కష్టం
* ప్రభుత్వం నడపటానికి చాలా పెద్ద యంత్రాంగం ఉంది