Shekhawat: రాష్ట్రానికి కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రితో కలిసి పోలవరం పర్యటన!

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇవాళ(03 మార్చి 2022) రాష్ట్రానికి రాబోతున్నారు.

Shekhawat: రాష్ట్రానికి కేంద్రమంత్రి.. ముఖ్యమంత్రితో కలిసి పోలవరం పర్యటన!

Jagan

Gajendra Singh Shekhawat: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఇవాళ(03 మార్చి 2022) రాష్ట్రానికి రాబోతున్నారు. రాష్ట్ర పర్యటనలో పోలవరం ప్రాజెక్టును సందర్శించి, ఉభయగోదావరి జిల్లాల్లోని పునరావాస కాలనీలను పరిశీలిస్తారు.

సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్తారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటి అనంతరం.. విజయవాడలోనే రాత్రి బస చేసి, శుక్రవారం ఉదయమే హెలికాప్టర్‌లో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇందుకూరుపేట పునరావాస కాలనీకి వెళ్తారు.

అక్కడ నిర్వాసితులతో మాట్లాడి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి పునరావాస కాలనీకి చేరుకుంటారు. తర్వాత పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతానికి వెళ్లి ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.

పోలవరం స్పిల్‌ వే, ఎగువ-దిగువ కాఫర్‌ డ్యాంలు, ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతాలను సందర్శిస్తారు. తర్వాత అక్కడే రాష్ట్ర భాజపా బృందాన్ని ఉద్దేశించి షెకావత్‌ ప్రసంగించనున్నారు. అనంతరం పోలవరం అధికారులతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి తిరిగి విజయవాడకు చేరుకుని, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులతో భేటి కానున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ సైతం కేంద్రమంత్రి షెకావత్‌తో పాటు పోలవరం పునరావాస కాలనీలు, ప్రధాన డ్యాం నిర్మాణ పరిశీలనకు వెళ్లనున్నారు. బీజేపీ కార్యక్రమాల్లో తప్ప ఇతర అన్ని కార్యక్రమాల్లోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ కేంద్ర మంత్రితో కలిసి పర్యటించనున్నారు.