కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా…జగన్,కేసీఆర్ భేటీపై అనుమానాలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 20, 2020 / 09:06 PM IST
కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా…జగన్,కేసీఆర్ భేటీపై అనుమానాలు

సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కేంద్రమంత్రికి కరోనా వైరస్ సోకింది.

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. ఆయాసం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని… ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు హాస్పిటల్ లో చేరినట్టు తెలిపారు. కొద్దిరోజుల నుంచి తనను కలిసిన వాళ్లు ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని గజేంద్ర సింగ్‌ షేకావత్‌ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో.. ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉంటుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. గతంలో ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. అయితే, అదే రోజు తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మరో తేదీని ఫిక్స్ చేసింది.

ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరుతారని తెలుస్తోంది. అలాగే, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఈ భేటీ యథాతథంగా కొనసాగుతుందా ? లేక మరో తేదీకి వాయిదా పడుతుందా ? అన్నది తేలాల్సి ఉంది.

కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది.