Uru Vada : ఊరు వాడ 60 వార్తలు

మేడ్చల్‌ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Uru Vada : ఊరు వాడ 60 వార్తలు

Uru Vada 60 News 3

Uru Vada 60 News : దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్‌ జిల్లా దూలపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతుండడంతో .. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. సేందుకు ప్రయత్నిస్తున్నారు.

నిర్మల్‌ జిల్లాలో లారీ దగ్ధం
నిర్మల్ జిల్లా సోఫీనగర్‌లో లారీ దగ్ధమైంది. లారీని పార్కింగ్‌ చేసిన చోటే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో .. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది .. మంటలను అర్పేశారు. ఈ లారీ షేక్ సాహెబ్ పేట్ కాలనీకి చెందిన అర్షద్‌దిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

దౌల్తాబాద్‌లో సిలిండర్‌ పేలుడు
వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లోని ఓ హోటల్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో హోటల్‌ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

పామిడిలో వాటర్‌ పైప్ లైన్‌ మరోసారి లీక్‌
అనంతపురం జిల్లా పామిడిలో అధికారుల నిర్లక్షం మరోసారి బయటపడింది. గుప్తాకాలనీలోని సాయిబాబా వాటర్‌ పైప్ లైన్‌ మరోసారి లీక్‌ అయింది. దీంతో రోడ్డుపై నీళ్లు వృధాగా పోతున్నాయి. రోడ్డంతా నీళ్లు ఉండడంతో .. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పైప్‌లైన్‌ లీక్‌ అవ్వడం ఇది మూడో సారి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతుపై ఎలుగుబంటి దాడి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. ఇవాళ ఉదయం గడ్డివాము దగ్గరికి వెళ్తున్న తనపై ఎలుగుబంటి దాడి చేసిందని మల్లన్న అనే రైతు చెప్పాడు. ఎలుగుబంటి దాడి చేస్తున్న సమయంలో కుక్కలు మొరగడంతో .. అది సమీప పొలాల్లోకి పరుగులు తీసిందన్నాడు. గాయపడిన మల్లన్నను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తుండడంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో చాకిరీ
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామంలోని ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులతో.. ఉపాధ్యాయులు మట్టి పని చేయిస్తున్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు చేయవలసిన పనిని .. విద్యార్థులతో చేయిస్తుండడంతో .. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సెక్రెటరీతోపాటు మరో 14 మందిని గ్రామ సచివాలయంలో ఉంచి తాళం
కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. 2018లో 16లక్షల 75 వేలతో పలు అభివృద్ధి పనులు చేశామని..అప్పటి నుంచి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని కాంట్రాక్టర్‌ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెక్రెటరీ ఆరేపల్లి వెంకటేశ్వరావుతో సహా మరో 14 మందిని గ్రామ సచివాలయంలో ఉంచి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సచివాలయం తాళం తీసి సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు సహకరించిన కొంతమందిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

బ్యాంకులో బంగారం గోల్‌మాల్‌
కర్నూలు జిల్లాలోని ఓ బ్యాంకులో బంగారం గోల్‌మాల్‌ కలకలం రేపుతోంది. ఉయ్యాలవాడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో .. 13 వందల గ్రాముల బంగారం కనిపించకుండా పోయింది. 17మందికి చెందిన బంగారు ఆభరణాలు మాయమైనట్టు సమాచారం. ఓ రైతు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న లోన్‌ రెన్యూవల్‌ చేసేందుకు వెళ్లటంతో .. గోల్డ్ మాయం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు సిబ్బందే మాయం చేశారని అనుమానిస్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

మేడ్చల్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
మేడ్చల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. జీడిమెట్ల పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో దోపిడీకి పాల్పడ్డారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో నెంబర్ ప్లేట్ లేని యాక్టివాపై వచ్చిన ఇద్దరు దుండగులు.. మనీ ట్రాన్స్‌ఫర్ షాపులోకి చొరబడ్డారు. షాపు యజమానిని గన్‌తో బెదిరించి సుమారు రెండు లక్షల రూపాయల నగదుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమరాలో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ భూములు కబ్జా
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. స్థానిక గెర్రె కాలనీ సర్వే నెంబరు 869లోని 20 గుంటల భూమిని .. జీవనోపాదుల శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం అప్పగించింది. 2009లో భవన నిర్మాణ పనులు పూర్తి చేసి .. ఉపాధి హామీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యాలయ భూమిని ఇటీవల కొందరు కబ్జా చేసి ప్రహరీ నిర్మించారు. దీంతో కబ్జా వ్యవహారాన్ని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోని భూములను కాపాడాలని కోరుతున్నారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీలో రెవెన్యూ బిల్ కలెక్టర్ ఆంజనేయులు లంచం తీసుకుంటుండగా .. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బొక్కావారి పాలెంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అనే వ్యక్తి .. తన ఇంటికి పన్ను వేయాలని ఆంజనేయులను కోరుతున్నాడు. దీనికి సంబంధించి అప్పుడప్పుడూ ఆంజనేయులు డబ్బులు తీసుకున్నాడు. అయినప్పటికీ పని పూర్తి చేయకపోవడంతో.. శ్రీనివాస్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ నుంచి 15 వందలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

పోలీసులు కార్డెన్‌ సర్చ్‌
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో పోలీసులు కార్డెన్‌ సర్చ్‌ నిర్వహించారు. ASP సాయి చైతన్య, IPS ఆధ్వర్యంలో మొత్తం 80 మంది పోలీసు సిబ్బందితో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 52 బైకులు, 3 ఆటోలు, ఒక ట్రాక్టర్, మూడు బెల్ట్ షాపులను సీజ్‌ చేశారు. ఒక గుడుంబా కేంద్రంలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీపీఎం రాస్తారోకో
అనంతపురం జిల్లా ఉరవకొండలో సీపీఎం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొన్నేళ్లుగా పేదల ఇంటి పట్టాల విషయంలో .. రాజకీయ నాయకులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం ప్రభుత్వం పని చేయడం లేదంటూ ఆరోపించారు. వెంటనే పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వీరిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చట్టాలకు వ్యతిరేకంగా సైకిల్ యాత్ర
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చట్టాలకు వ్యతిరేకంగా .. నిరసన సైకిల్ యాత్ర చేపట్టారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో.. విజయవాడ నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం వరకు ఈ యాత్ర మొదలుపెట్టారు. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ మాదిగ .. సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన విశాఖ ఉక్కును తుక్కుగా అమ్మేస్తుంటే ఆంధ్రులు చూస్తూ ఊరుకోరని నాయకులు హెచ్చరించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల నిరసన
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ .. గుంటూరు జిల్లా కోర్టు వద్ద.. అఖిలభారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. న్యాయవాదులు, ప్రజాసంఘాల సమక్షంలో ఆందోళన నిర్వహించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించడాన్ని .. ఐలు అధ్యక్షుడు నర్రా శ్రీనివాస్ అభినందించారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన విశాఖ ఉక్కును కాపాడుకుండామని నినాదాలు చేశారు. రేపు విశాఖలో జరిగే సభను జయప్రదం చేయాలని కోరారు.

ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా
నెల్లూరు జిల్లా సంగం మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగు మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఎండబెట్టిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి మిల్లుల వద్ద ధాన్యం లోడ్లతో పడిగాపులు కాస్తున్నా మిల్లర్లు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో రైతుల నుంచి పురుగుల మందు డబ్బాలను పోలీసులు బలవంతంగా తీసుకున్నారు.

10టీవీ కథనానికి స్పందించిన కంభం ఆర్టీసీ అధికారులు
బస్టాండ్‌లో మురుగునీటిపై 10టీవీ ప్రసారం చేసిన కథనానికి .. ప్రకాశం జిల్లా కంభం ఆర్టీసీ అధికారులు స్పందించారు. బస్టాండ్‌లో టాయిలెట్ల మురుగునీరు నిలిచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో .. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రసారం చేసిన. దీంతో తక్షణమే టాయిలెట్లకు మరమ్మతులు చేపట్టి మురుగు నీరు నిల్వ ఉండకుండా అధికారులు మరమ్మతులు నిర్వహించారు. తతమ సమస్యను పరిష్కారించిన 10టీవీకి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

టీకా తీసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా ఉందని.. ప్రతిఒక్కరు అపోహలు మాని వ్యాక్సిన్ వేయించుకోవాలని .. ఎమ్మెల్యే సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకున్న బండి సంజయ్‌
కరీంనగర్ జిల్లా ఆర్టీసీ ఆస్పత్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని సంజయ్‌ గుర్తుచేశారు. అందరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.

తూ.గో జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు.. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి. అందరు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. దీంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిని పూర్తిస్థాయిలో కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఏపీకి మరో 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు
ఏపీకి మరో 5 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు చేరాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కోవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. మొదట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి చేర్చిన టీకాలను.. అక్కడి నుంచి జిల్లాలకు తరలిస్తున్నారు.

అద్దంకిలో పర్యటించిన జిల్లా కలెక్టర్‌
ప్రకాశం జిల్లా అద్దంకిలో కోవిడ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. పట్టణంలో పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నంబూరువారి పాలెం, టీచర్స్ కాలనీలో పర్యటించారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలను శానిటైజేషన్‌ చేయించాలని అధికారులను ఆదేశించారు.

వ్యాక్సినేషన్ కోసం బారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ప్రజలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి బారులు తీరారు. సుజాతనగర్ మండలంలో ఉదయం 8 గంటల నుంచే ఆసుపత్రిలో టీకా తీసుకోవడానికి వేచి చూస్తున్నారు. కరోనా నుంచి బయట పడాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి కావడంతో అని విశ్లేషకులు చెప్తుండడంతో వ్యాక్సిన్ కోసం జనాలు భారీగా తరలివస్తున్నారు.

హోం క్వారంటైన్‌లో నిబంధనలు అతిక్రమించిన వ్యక్తి
హోం క్వారంటైన్‌లో నిబంధనలు అతిక్రమించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ఓ జ్యూయలర్ షాప్ యజమానికి వైరస్‌ సోకింది. అయితే 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండకుండా షాపు తెరవడంతో .. మండల వైద్యాధికారి ధర్మానాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

కరోనాపై అవగాహన కోసం పోలీసులు విస్తృతంగా ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. దీంతో కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడానికి అందరు తమ వంతు పాత్ర పోషించాలని.. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

మాస్కులు ధరించని వారికి జరిమానా
కరోనా విజృంభిస్తోన్న వేళ.. నివారణ చర్యలపై మరింతగా దృష్టిసారించారు అధికారులు. మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి జరిమానా విధిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 12వందల మందిపై ఫైన్లు వేశారు. ప్రతి ఒక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారు. మాస్కులు ధరించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.

కరోనా విజృంభిస్తుండడంతో పోలీసులు అప్రమత్తం
అనంతపురం జిల్లాలో కరోనా విజృంభిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమందేపల్లిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని ఆటో డ్రైవర్లతో సీఐ శ్రీహరి దిశానిర్దేశం చేశారు. ఆటోలో ప్రయాణించే ప్రతి ఒక్కరు మాస్కు ధరించేలా చూడడంతో పాటు .. సామాజిక దూరం ఉండేలా చూడాలని డ్రైవర్లకు సూచించారు. అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పవన్‌కళ్యాణ్‌ కోలుకోవాలని పూజలు
పశ్చిమగోదావరిజిల్లా ద్వారకాతిరుమలలో జనసేన నాయకులు, కార్యకర్తలు వెంకన్న ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అధినేత పవన్‌కల్యాణ్‌ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని.. ప్రార్థనాలు చేశారు. అనంతరం ఆలయ తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఆ తర్వాత అభయాంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో కిడ్నాప్ కలకలం
రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవుపల్లి కింగ్స్ కాలనీలో కిడ్నాప్ కలకలం రేగింది. మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో కింగ్స్‌ కాలనీలో నదీమ్‌ ఖాన్‌ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నదీమ్‌ఖాన్‌కు ఇటీవల ఓ అమ్మాయితో నిశ్చితార్థం అయింది. అయితే ఆ అమ్మాయిని వేరే యువకుడు ప్రేమించాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయితో నదీమ్‌ఖాన్‌ నిశ్చితీర్ధం చేసుకోవడంతో .. కోపంతో అతన్ని కిడ్నాప్ చేశాడు.

తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కుమారుడు
సూర్యాపేట జిల్లా నారాయణ గూడెంలో దారుణం జరిగింది. తండ్రి నంద్యాల అంజిరెడ్డిని కుమారుడు అమరసింహ రెడ్డి బండరాయితో కొట్టి చంపాడు. అమరసింహ రెడ్డి ఐదేళ్లు విదేశాల్లో ఉండి వచ్చాడు. అక్కడ ఉన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారి మతిస్థిమితం కోల్పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. డబ్బుల కోసం తండ్రితో తరచూ ఘర్షణ పడుతుండేవాడని .. ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బండరాయితో కొట్టి చంపాడని చెబుతున్నారు.

డబ్బుల కోసం చిన్నారిని విక్రయించిన తండ్రి?
రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. రెండు నెలల చిన్నారిని తండ్రే డబ్బుల కోసం విక్రయించినట్టుగా తెలుస్తోంది. MMపహాడి సమీపంలో నివశించే షహానా బేగం, సయ్యద్‌ హయద్‌ అలీకి రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. అయితే బాబు నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో షహనా పోలీసులను ఆశ్రయించింది. అయితే బాబు తండ్రే 30వేల రూపాయలకు చిన్నారిని విక్రయించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

నకిలీ ఐఎఎస్‌ అరెస్ట్‌
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న.. ఓ నకిలీ IAS అధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు తీసుకొని ఎంతకి ఉద్యోగం ఇప్పించకపోవడంతో దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ IAS బర్ల లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేసి.. ఫేక్‌ సర్టిఫికెట్స్‌తో పాటు 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్‌ జిల్లాలో దొంగలు అరెస్ట్‌
మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి యమహా స్పోర్ట్స్ బైకులు, రెండు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి , కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలని ఆలోచనలతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

చెత్త సేకరణకు వెళ్లిన మున్సిపల్ కార్మికుడిపై దాడి
నిజామాబాద్‌లోని గౌతంనగర్‌లో మున్సిపల్ కార్మికుడిపై దాడి జరిగింది. చెత్త సేకరించేందుకు వెళ్లిన కార్మికుడిపై ఓ ఇంటి యజమాని దాడికి యత్నించాడు. మాస్క్‌ ధరించకుండా చెత్త వేయడానికి రావడంతో అభ్యంతరం తెలిపాడు కార్మికుడు. మాస్క్ పెట్టుకోవాలన్నాడు. దీంతో కార్మికుడిపై పార, రాడ్లతో దాడికి యత్నించాడు. ఈ ఘటనపై మున్సిపల్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లిని చంపిన తనయుడు
మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాలపేట మండలం పొలికాపాడ్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. శివ అనే యువకుడు తల్లి కాశిమ్మను గొడ్డలితో నరికి చంపాడు. తన ఇంట్లో ఎందుకు ఉంటున్నావని రోజూ తల్లి గొడవ చేస్తుండడంతో .. చంపాడని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేశారు.

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పెద్దాపురం గ్రామంలో SPOగా విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయంలో పురుగుల మందు తాగి ఆకస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. సూసైడ్‌కు సంబంధించిన కారణాలు తెలియలేదని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తల్లి చెంతకు యువతి
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో ఈనెల 11న గుర్తు తెలియని యువతి స్పృహ తప్పి పడిపోయింది. ఆ యువతిని 108 సిబ్బంది జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చించారు. ఇప్పుడు ఆమె కోలుకోవడంతో సఖి కేంద్రానికి అప్పగించారు. సఖి కేంద్ర అధికారులు ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి వివరాలు సేకరించారు. యువతిది మహబూబ్‌నగర్ జిల్లా బోయపల్లి అని చెప్పడంతో తల్లికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న తల్లికి అధికారులు యువతిని అప్పగించారు.

కొమురవెల్లి ఆలయానికి వెళ్లి వస్తుండగా విషాదం
కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కృష్ణ గౌడ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. వీళ్లంతా నిజామాబాద్‌ జిల్లా ముదక్‌పల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కొమురవెల్లి ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

రూ.300 కోట్ల స్కాంలో రోజుకో మలుపు
అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చిన మూడు వందల కోట్ల రూపాయల స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. లక్ష రూపాయలకు ప్రతినెల 30వేలు వడ్డీ ఇస్తానని.. పదినెలల్లో మూడు లక్షలు ఇస్తామంటూ బురిడీ కొట్టింది మూడు వందల కోట్లు వసూలు చేసిన ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకుడు, అతని ఏజెంట్ల నడుమ గొడవ ముదురుతోంది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ పేరుతో ముఠా సభ్యులు కోట్లలో వసూలు చేశారు. దాదాపు 800 మంది నుంచి డిపాజిట్ల రూపంలో 300 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

మోసపోయిన వారిలో కొందరు అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టారు. కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని తెలుసుకున్న 100 మందికి పైగా బాధితులు ధర్మవరం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. 50 మంది బాధితులతో ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఓ కానిస్టేబుల్‌, జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సై కూడా ఏజెంటు తరహాలో నగదు కట్టించినట్లు తెలుస్తోంది.

ఉపాధి హామీ పనులు చేస్తూ వడదెబ్బతో వ్యక్తి మృతి
నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి ఖిల్లా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తూ మేదరి రాజయ్య అనే వ్యక్తి వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ప్రధమ చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డిచ్‌పల్లి ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు.

అగ్నిప్రమాదాలపై విద్యార్థినులకు అవగాహన
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అధికారులు అగ్నిప్రమాదాలపై విద్యార్థినిలకు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళన చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు.

పోలింగ్‌బూత్‌ ఎదుట ఉద్రిక్తత
నెల్లూరు జిల్లా డక్కిలి మండలం కమ్మపల్లి గ్రామంలో .. పోలింగ్‌బూత్‌ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓట్లు వేసే విషయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ చివరకు ఇరు వర్గాలు కొట్టుకునే వరకూ వెళ్లింది. వృద్ధులు ఓటు వేసే సమయంలో ఇరువర్గాలు తామే ముందుగా ఓటు వేస్తామని ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఘర్షణ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను తరిమికొట్టారు.

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన గుంటూరు రేంజ్ అధికారి
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉపఎన్నిక సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాలను గుంటూరు రేంజ్ అధికారి త్రివిక్రమ వర్మ పరిశీలించారు. అనంతరం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీ
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ పరిశీలించారు. పోలింగ్‌ సరళిని పరిశీలించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. దీంతో పాటు కోవిడ్‌ నిబంధనల ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను పలకరించారు.

గోపవరం పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత
నెల్లూరు జిల్లా కలువాయి మండలం పెద్ద గోపవరం పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం బాహాబాహీకి దిగాయి. ఓటు వేసే సమయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో కుర్చీలు తీసుకుని రెండు వర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది.

తిరుపతి ఉపఎన్నికను బహిష్కరించిన కొత్తపాళెం ఓటర్లు
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళెం పంచాయతీ ఓటర్లు.. తిరుపతి ఉపఎన్నికను బహిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు, తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కానందునే ఎన్నికలను బహిష్కరించి పోలింగ్‌ కేంద్రం వద్దకు రాలేదు. దీంతో సబ్‌ కలెక్టర్‌ వారిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ గ్రామస్థులు ఒప్పుకోలేదు.

ఎన్నికలను బహిష్కరించిన ఊరుందూరు
చిత్తూరు జిల్లా ఊరుందూరు గ్రామంలో పోలింగ్‌ కొనసాగుతోంది. ముందుగా పోలింగ్‌లో పాల్గొనే అంశంపై గ్రామస్ధుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇందులో గ్రామంలోని ఓ వర్గం ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనగా.. మరొక వర్గం ప్రజలు పాల్గొనలేదు. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఊరుందూరు ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.

నాగార్జునసాగర్‌లో పోలింగ్‌ కేంద్రాల్లో సీఈసీ పర్యటన
నాగార్జునసాగర్‌లో పైలాన్, హిల్ కాలనీలోని పోలింగ్ బూతులను ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. కోవిడ్ పెరుగుతుండటంతో తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 7 పోలింగ్‌ బూత్‌ల్లో ఎన్నికల సరళిని శశాంక్‌ పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నామినేషన్ వేయడానికి వస్తున్న అభ్యర్థులు, నాయకులు తప్పుకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు.

వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ
వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగుతోంది. లాల్‌బహదూర్ కళాశాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రానికి అభ్యర్థులు తరలివచ్చి.. తమ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

టీఆర్ఎస్ శ్రేణుల భారీ ర్యాలీ
వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ఉపఎన్నిక సందర్భంగా.. పట్టణ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆశీస్సులతో అధిక మెజారిటీతో గెలుస్తానని, వార్డులో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చారు.

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలవరకు సుమారు 50 నామినేషన్లు వివిధ పార్టీల అభ్యర్థులు వేశారు. అధికారపార్టీ నాయకులు ర్యాలీగా బయలుదేరి కేంద్రాల వద్దకు చేరుకున్నారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరినీ మాత్రమే అధికారులు అనుమతించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు చల్లటి నీళ్ళు, టెంట్ సౌకర్యాలు కల్పించారు.

కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి ఆకస్మిక తనిఖీ
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి తానేటి వనిత అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు విధులకు గైర్హాజరవుతుండడంపై పలువురు ఫిర్యాదు చేయడంతో .. మంత్రి తనిఖీలు చేపట్టారు. విధులకు హాజరు కానీ వైద్యులుపై వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా ఉంటే సహించబోమని మంత్రి హెచ్చరించారు.

వివేక్‌ కలను నేరవేరుస్తాం
కోటి మొక్కలు నాటాలన్న తమిళ హాస్యనటుడు వివేక్ కలను… తాము నెరవేరుస్తామన్నారు ఎంపీ సంతోశ్‌కుమార్. వివేక్ లక్ష్యం అర్థాంతరంగా ఆగిపోకుండా మిగిలిన మొక్కలను నాటే కార్యక్రమాన్ని తాము కొనసాగించి, పూర్తి చేస్తామన్నారు. అదే ప్రకృతి ప్రేమికుడు వివేక్‌కు నిజమైన నివాళి అని సంతోష్ ట్వీట్ చేశారు.

పంటనష్టం జరిగిన గ్రామాల్లో ఎమ్మెల్యే కఠారు అబ్బయ్యచౌదరి పర్యటన
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో అకాలవర్షాలకు పంటనష్టం జరిగిన గ్రామాల్లో .. ఎమ్మెల్యే కఠారు అబ్బయ్యచౌదరి పర్యటించారు. లక్షల్లో అప్పుచేసి పెట్టుబడి పెట్టామని.. ఆకాల వర్షాలకు పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం తరుపున నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

CITU ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీ కార్మికులకు CITU ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న జల సాధన సమితి అధ్యక్షులు రమణయ్య .. వారికి అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందని మాకినేని రమణయ్య తెలిపారు.

శ్రీ చౌడేశ్వరి దేవిజ్యోతి మహోత్సవాలు
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం రాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవ స్వామి గుడి దగ్గర జ్యోతులు వెలిగించి మహిళలు, చిన్నారులు ఊరేగింపుగా బయలుదేరారు. సుమారు మూడు వందల జ్యోతులను నెత్తినపెట్టుకొని శాంభవి తమను కాపాడు తల్లి అంటూ నృత్యం చేస్తూ పాటలు పాడారు.

ఈ ఉత్సవాలను తొగట వీర క్షత్రియులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మొత్తం 3వందల జ్యోతులను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ ఈవో రామానుజన్ తీర్థప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భద్రాద్రి శ్రీరామనవమికి కోటి తలంబ్రాలు సిద్ధం
శ్రీ రామనవమికి భద్రాచలంలో జరుగనున్న రాములవారి కల్యాణ మహోత్సవానికి.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను సిద్ధం చేశారు. రాజమండ్రి పవిత్ర గోదావరి నదీ తీరం, పుష్కరాల రేవులో సీతారాములకు కలశాలతో గోదావరి నీటితో అభిషేకం నిర్వహించారు. ఈ తలంబ్రాలను 21వ తేదీన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి పంపుతున్నామని నిర్వహకులు తెలిపారు.

నిరాడంబరంగా కొండగట్టు హనుమాన్‌ జయంతి
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉత్సవాలను భక్తులు లేకుండానే నిర్వహిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్‌ తెలిపారు. భక్తులు మాల విరమణ కోసం, మాల ధారణ కోసం రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.