Instagram ఫొటోలు సేకరించి ఫేక్ అకౌంట్లు.. రూ.20లక్షలు దోచేశాడు

Instagram ఫొటోలు సేకరించి ఫేక్ అకౌంట్లు.. రూ.20లక్షలు దోచేశాడు

రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తున్నారా..? ఆ ఫొటోలకొచ్చే లైక్స్‌, కామెంట్లను చూసి మురిసిపోతున్నారా..? అయితే అమ్మాయిలు ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండాలి. లైక్‌ల సంగతి పక్కన పెడితే.. మీ లైఫ్‌ రిస్క్‌లో పడటం ఖాయం. ఎందుకంటే.. మీ ప్రమేయం లేకుండానే మీ ఫొటోలు డేటింగ్‌ యాప్‌ల్లోకి చేరిపోతాయి. అక్కడి నుంచి ఎక్కడెక్కడికో వెళ్లిపోతాయి. 

అలాంటి ఫొటోలను యూజ్‌ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్ట్రాగ్రామ్‌ యాప్‌ నుంచి యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేయడం.. వాటిని వినియోగించి డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేయడం.. వాటితో యువకుల మెసేజ్‌లు చేస్తూ సెక్స్‌ చాట్, న్యూడ్‌ ఫొటోలంటూ డబ్బులు వసూలు చేయడం.

ఏడాది కాలంగా ఈ పంథాలో అనేక మందిని మోసం చేసిన సీఏ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి వెన్నెల వెంకటేష్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు యువతుల మాదిరిగా చాటింగ్‌ చేసి 20 లక్షలు వరకు వసూలు చేసినట్లు గుర్తించారు.

విజయనగరం జిల్లాకు చెందిన వెన్నెల వెంకటేష్‌.. విజయవాడలో కొన్నాళ్ళు చదువుకుని ప్రస్తుతం సీఏ ఫైనల్‌ ఇయర్‌కు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. యూసఫ్‌గూడ పరిధిలోని శ్రీ రామ్‌నగర్‌ కాలనీలో బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. చార్టెడ్‌ అకౌంటెంట్‌గా మారే లోపే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలని భావించి యువతుల పేరిట ఎరవేసే ప్లాన్‌ వేశాడు. 

ఇన్‌స్ట్రాగ్రామ్‌ నుంచి అందమైన యువతుల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసుకునేవాడు. వాటిని వినియోగించి వేర్వేరు పేర్లతో డేటింగ్‌ యాప్‌ టిండర్‌లో ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసేవాడు. తనతో ఎవరైనా చాటింగ్‌ చేయాలంటే పింగ్‌ చేయండి అంటూ తన వాట్సాప్‌ నెంబర్‌ ఇచ్చేవాడు. అలా చాటింగ్‌లోకి వచ్చిన వారితో అతడే యువతిగా చాటింగ్‌ చేసేవాడు. సెక్స్‌ చాటింగ్‌ చేయాలంటే 100, న్యూడ్‌ ఫొటోలు పంపాలంటే 300, న్యూడ్‌ వీడియో కాలింగ్‌ చేయాలంటే 500 తన బ్యాంకు ఖాతాలో పంపాలని కోరేవాడు. 

అంగీకరించిన వారికి విజయవాడలోని బ్యాంకు ఖాతా వివరాలు అందించేవాడు. ఎవరైనా డబ్బు డిపాజిట్‌ చేయడానికి ముందు మగా, ఆడా…అంటూ సందేశం పెడితే వెంటనే బై అంటూ వారిని కట్‌ చేస్తున్న భావన కలిగించేవాడు. దాంతో పూర్తిగా ఇతడి వలలో పడిపోయి మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేసే వాళ్ళు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేసే వారు కాదు. దాంతో దాదాపు ఏడాది కాలంలో అతగాడు అనేక మందిని మోసం చేసి నుంచి 20 లక్షల వరకు తన ఖాతాలో వేయించుకోగలిగాడు.

తాజాగా…2 నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఫొటో ఉపయోగించి టిండర్‌ యాప్‌లో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు. ఆ యువతికి ఇటీవలే ఓ యువకుడితో నిశ్చితార్థం అయింది. యువతి ఫొటోతో ఓ ప్రొఫైల్‌ టిండర్‌లో ఉన్నట్లు కాబోయే భర్త తరఫు వారికి తెలియడంతో ఎంగేజ్‌మెంట్‌ రద్దయింది. దాంతో బాధిత యువతి సిటీ సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. వెంకటేష్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.