ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వెల్దుర్తి హైవే

ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా వెల్దుర్తి హైవే

Veldurthy Road : రక్తం రుచి మరిగిన రహదారి మరోసారి పంజా విసిరింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి హైవే 14 మందిని బలి తీసుకుంది. వేగం రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఎటు చూసినా రక్తపు మరకలు.. అచేతనంగా పడివున్న మృతదేహాలు.. లారీ స్పీడ్ దెబ్బకి నుజ్జునుజ్జయిన టెంపో వాహనాం… అందులోనే ఇరుక్కున్న మృతదేహాలు.. బంధువుల రోదనలు, ఆర్తనాదాలు.. ఇలా వెల్దుర్తి ప్రమాదం స్థలం భీతావహంగా మారింది.

గతంలో ఇదే రహదారిపై గతంలో చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వెల్దుర్తి హైవే యాక్సిడెంట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. 2019 మే 11 న వెల్దుర్తి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 నిండు ప్రాణాలు బలయ్యాయి. పెళ్లి చూపులకు వెళ్లి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం నిర్దాక్షిణ్యంగా కాటేసింది. వెల్దుర్తి క్రాస్ రోడ్ సమీపంలో ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు, తుఫాను వాహనం, బైకు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. ఆ సమయంలో చనిపోయిన వారంతా గద్వాల జిల్లా రామాపురం గ్రామానికి చెందిన వారే.

2019 మే 11న హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ప్రైవేట్‌ వోల్వో బస్సు అతివేగంతో గద్వాల వైపు వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో.. స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో… డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని వోల్వో బస్సు ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు కూడా వెల్దుర్తి రహదారిపైనే భారీ ప్రమాదం జరగడంతో.. హైవే మరోసారి చర్చనీయాంశమైంది.

వెల్దుర్తి హైవే ఎందుకు డెత్‌ స్పాట్‌గా మారుతోంది. వాహనాల అతి వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయా? లేదంటే రోడ్డు నిర్మాణంలో ఏవైనా లోపాలున్నాయా? తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతోమంది ప్రాణాలు పోతున్నా అధికారులు ఎందుకు పట్టించకోవడంలేదన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.