ఏంటీ ఇలాగైపోయినాది : మండలి రద్దు నిర్ణయం..ఆలోచనలో విజయనగరం నేతలు

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 03:11 PM IST
ఏంటీ ఇలాగైపోయినాది : మండలి రద్దు నిర్ణయం..ఆలోచనలో విజయనగరం నేతలు

నేడో రేపో ఆ అదృష్టం వరిస్తుంది. ఎంచక్కా చట్ట సభలో అడుగుపెట్టవచ్చు. ఇదీ నిన్నటి వరకూ విజయనగరం జిల్లాలోని అనేక మంది వైసీపీ నాయకుల ఆశ. తాజాగా మండలి రద్దుకు శాసనసభలో తీర్మానం చేయడంతో నాయకులంతా ఒక్కసారిగా డంగైపోయారు. తమ భవిష్యత్తు గురించి పార్టీ పెద్దల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో ఆశావహులంతా నిరాశ చెందుతున్నారు. కష్టకాలంలో పార్టీని జనంలోకి తీసుకెళ్లామని… ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని అసంతృప్తిగా ఉన్నారట. ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశలు పెట్టుకుంటే.. పంతానికి పోయి ఇప్పుడిలా చేస్తారని గొల్లుమంటున్నారట. ఆ పార్టీలో పదవులు ఆశించిన సీనియర్‌ నాయకులంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డరని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

శాసనమండలి రద్దుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంతో జిల్లా నాయకులు షాక్‌ తిన్నారు. ఎమ్మెల్సీ పదవి ఇక కలేనని లోలోపల బాధ పడుతున్నారు. అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు గెలుచుకొని అధికారంలో ఉన్నందున ఈసారి ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు తమ పార్టీ వారికే వస్తాయని వైసీపీ నాయకులు భావించారు. అందుకోసం ముందస్తు సన్నాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు. తమ కోరికను పెద్ద నాయకుల దృష్టికి తీసుకు వెళ్లారు. కొద్ది రోజుల్లో తమ కల నెరవేరుతుందన్న నమ్మకంతోనే ఉన్నారు. ఎమ్మెల్సీ పదవుల విషయంలో పార్టీ నుంచి కొంత మందికి నేరుగా హామీలు కూడా వచ్చాయి. మరికొంత మంది ఆశావహులుగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేయడం మింగుడు పడడం లేదట.  

మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్నారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి నడిపించారు. అప్పటికి జిల్లాలో ప్రధాన నాయకుడు కావటంతో జిల్లా వ్యాప్తంగా పర్యటించి పార్టీ పటిష్టానికి కృషి చేశారు. కానీ 2019 ఎన్నికలకు ముందు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పించి బడ్డుకొండ అప్పలనాయుడుకు అప్పగించారు. టికెట్‌ కూడా సాంబశివరాజుకు దక్కలేదు. అసంతృప్తితో ఉన్న రాజును బుజ్జగించి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయన మెత్తబడ్డారని అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఆ అవకాశం ఉండదంటున్నారు. 

శృంగవరపు కోట టికెట్‌ను సీనియర్‌ నాయకుడు నెక్కల నాయుడుబాబు ఆశించారు. కానీ గజపతినగరం నియోజకవర్గానికి చెందిన కడుబండి శ్రీనివాసరావుకు కేటాయించారు. ఈ సందర్భంలో అసంతృప్తితో ఉన్న నాయుడుబాబుకు కూడా ఎమ్మెల్సీ ఎర వేశారట జగన్‌. ఇదే నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు బీజేపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆయనకు కొంత ఓటు బ్యాంకు ఉందన్న కారణంగా బొత్స వర్గానికి చెందిన వారి సూచన మేరకు జగన్‌ పాదయాత్ర సమయంలో పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకు కూడా సేమ్‌ ఎమ్మెల్సీ బిస్కట్‌ వేశారనే ప్రచారం సాగింది. ఇప్పుడు వారికి చాన్స్‌ లేనట్టే. 

పార్వతీపురం నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన జమ్మాన ప్రసన్నకుమార్‌.. 2019 ఎన్నికల్లో టికెట్‌ తనకే వస్తుందని భావించారు. ప్రతిపక్షంలో ఉండగా నియోజకవర్గంలో పార్టీని నడిపించారు. అయితే నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న జమ్మాన స్థానంలో బలిజిపేట మండలానికి చెందిన అలజంగి జోగారావుకు బాధ్యతలు అప్పగించారు. టికెట్‌ కూడా జోగారావుకు కేటాయించారు. ఈ సందర్భంలో అసంతృప్తితో ఉన్న ప్రసన్నకుమార్‌కు పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్న హామీ లభించినట్లు చెప్పుకున్నారు. 

జగన్‌ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా సాగేందుకు మంత్రి బొత్స మేనల్లుడు, పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కృషి చేశారు. ఎస్‌.కోట నియోజకవర్గంలో ప్రారంభం నుంచి జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే వరకు ఆయన వెంట ఉన్నారు. దీంతో ఆయనకు కూడా సేమ్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఇలా జిల్లాలో అనేక మంది నాయకులకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. వారు కూడా అదే భావనలో ఇన్నాళ్లూ బతికేశారట. కొంతమందికి పార్టీ నేరుగా హామీ ఇచ్చింది. ఇంకొందరు ఆయా నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎమ్మెల్సీ పదవులపై ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఆ మండలే లేకుండా పోయేలా ఉండడంతో వారి ఆశలన్నీ పటాపంచలైపోయాయని కార్యకర్తలు జాలిపడుతున్నారట.

ఎమ్మెల్సీ అవకాశాలు సన్నగిల్లడంతో ఇప్పుడు వీరంతా కొత్త పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారట. ముఖ్యంగా త్వరలో ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి మండలి కూడా ఏర్పడనుంది. ఈ మండలికి చైర్మన్‌తో పాటు డైరెక్టర్ల పదవులు కూడా ఉంటాయి. అంతే ఆశావహులంతా ఇప్పుడు ప్రాంతీయ అభివృద్ధి మండలి పోస్టుల కోసం పైరవీలు మొదలుపెడుతున్నారట. మరి వీరి ఆశలు నెరవేరతాయా? లేక అసంతృప్తి సెగలతో రగిలిపోతూ ఉండాల్సిందేనా.. అన్నది వేచి చూడాల్సిందే.