AP Politics :ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిపోయిందా? వైసీపీలో హాట్ టాపిక్‌గా విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ

ఆ ఇద్దరు నేతల మధ్యా గ్యాప్ తగ్గిపోయిందా? అందుకే ఇద్దరు భేటీ అయ్యారా అనిపిస్తోంది.వారే సజ్జల, విజయసాయి రెడ్డిలు. వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ.

AP Politics :ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిపోయిందా? వైసీపీలో హాట్ టాపిక్‌గా విజయసాయి రెడ్డి, సజ్జల భేటీ

Sajjala Vijai Sai Reddy (1)

AP Politics : వైసీపీలో ఎంతమంది నాయకులున్నా.. వాళ్లిద్దరే కీలక నేతలు. వాళ్లలో ఒకరు జగన్‌కు కుడి భుజమైతే.. మరొకరు ఎడమ భుజం. ఒకరు కేంద్ర వ్యవహారాలు చూసుకుంటే.. మరొకరు రాష్ట్ర వ్యవహారాల్లో చక్రం తిప్పుతారు. అలాంటి ఇద్దరు నేతలు.. ఇప్పుడు కలిసిపోయారు. మొదటిసారి.. భేటీ అయ్యారు. కీలక అంశాల గురించి చర్చించారు. ఒకే పార్టీ నేతలు కలిసిపోయి.. భేటీ అయితే ఇంతలా చర్చ ఎందుకు జరుగుతోంది. వాళ్ల గురించి.. వైసీపీలో ఈ రేంజ్ టాక్ ఎందుకు నడుస్తోంది.

అధికార వైసీపీలో.. జగన్ తర్వాత కనిపించే కటౌట్స్ ఏమైనా ఉన్నాయా అంటే.. అది సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి మాత్రమే. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ.. అన్ని వ్యవహారాల్లో వీళ్ల ప్రమేయం ఉంటుంది. ముఖ్యంగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి వీళ్లిద్దరూ జగన్‌కి తోడుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. సజ్జలను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు జగన్. అలా.. ప్రభుత్వ వ్యవహారాల్లో.. సజ్జల కీ రోల్ పోషించారు. అటు రాజ్యసభ ఎంపీగా.. విజయసాయిరెడ్డి ఢిల్లీ లెవెల్‌లో వ్యవహారాలు చక్కబెట్టే బాధ్యత అప్పజెప్పారు. దీంతో పాటు ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్‌గా.. అక్కడి వ్యవహారాలు చూసుకున్నారు. దీంతో.. సజ్జల, విజయసాయి మధ్య గ్యాప్ వచ్చిందని.. పార్టీలో ఓ టాక్ ఉండేది. మూడేళ్లుగా.. వీళ్లిద్దరూ ఎప్పుడూ కలిసి కనిపించలేదు. అందుకే.. వీళ్లిద్దరిపై.. పార్టీలో రకరకాల ఊహాగానాలు, చర్చలు వినిపిస్తుంటాయ్.

ఈ మధ్యే.. సీఎం జగన్ విజయసాయి, సజ్జల బాధ్యతల్లో మార్పులు చేశారు. సజ్జలకి.. ఎమ్మెల్యేల కో-ఆర్డినేషన్ బాధ్యతలు అప్పజెప్పారు. అలాగే.. సాయిరెడ్డికి.. 26 జిల్లాల అధ్యక్షుల కో-ఆర్డినేషన్ ఇచ్చారు. దాంతో పాటు వైసీపీ అనుబంధ సంఘాల ఇంచార్జ్‌గానూ ఉన్నారు. అయితే.. తాజా మార్పుల్లో విజయసాయికి ప్రాధాన్యత పెరిగి.. సజ్జలకి కాస్త తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. పార్టీలో, ప్రభుత్వంలో.. ఇద్దరినీ బ్యాలెన్స్ చేసేందుకే.. జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. పార్టీ వర్గాల్లో మరో చర్చ సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. విజయసాయి రెడ్డి.. సజ్జల నివాసానికి వెళ్లి కలవడం.. పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే.. సజ్జల, సాయిరెడ్డి భేటీ.. సీఎం జగన్ ఆదేశాల మేరకే జరిగిందని.. మరో టాక్ వినిపిస్తోంది. ఎలాంటి విభేదాలకు తావు లేకుండా.. ఇద్దరూ కలిసి పనిచేయాలని.. జగన్ సూచించినట్లు.. కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే సాయిరెడ్డి.. సజ్జల నివాసానికి వెళ్లి కలిశారనే ప్రచారం సాగుతోంది. అధినేత ఇచ్చిన కొత్త బాధ్యతలను.. సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కలిసి పనిచేయాలని.. ఇద్దరు నేతలు నిర్ణయం తీసుకున్నారట.

తాజా సమావేశంలో.. గడప, గడపకు వైసీపీ కార్యక్రమంపైనే.. గంటకు పైగా చర్చించారని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామం.. వైసీపీలో కాస్త జోష్ తెచ్చింది. ఇన్నాళ్లూ.. వీళ్లిద్దరి మధ్య గ్యాప్ ఉందనే అనుమానాలను, ప్రచారాలను.. ఈ ఒక్క మీటింగ్ పటాపంచలు చేసేసింది. ఇకపై.. వీళ్లిద్దరూ కలిసి.. పార్టీ కోసం పనిచేస్తారని.. వైసీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.