చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలేమో, ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడు

vijayasai reddy on chandrababu, nimmagadda: టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. వారిద్దరిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ పరంగా జరగవని విజయసాయిరెడ్డి అన్నారు. అలాంటిది చంద్రబాబు మేనిఫెస్టో ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు మేనిఫెస్టో ఎలా విడుదల చేస్తారని విజయసాయిరెడ్డి నిలదీశారు. 2024 వరకు టీడీపీ ఉంటుందా? ఉండదా? అనే సందేహం చంద్రబాబుకి వచ్చిందేమోనని విజయసాయిరెడ్డి అన్నారు.

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు విజయసాయిరెడ్డి. ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ అనర్హుడని అన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్ఈసీగా ఎంతో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఒకరికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.

ఓ దశలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలు నిలిపివేశారని, ఆ సమయంలో కరోనా వ్యాప్తిని కారణంగా చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా పూర్తిగా తొలగిపోలేదని, మరి నిమ్మగడ్డ ఎందుకంత తొందరపడుతున్నారని విజయసాయి అడిగారు. పదవీ విరమణ లోపు ఎన్నికలు జరిపాలని ఎందుకు ఆరాటపడుతున్నాడని నిమ్మగడ్డను ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి చంద్రబాబుతో లాలూచీ పడి ఇలాంటి పనులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు.

పార్టీ రహితంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలకు పార్టీ తరఫున మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని విజయసాయి నిలదీశారు. ప్రతి ఒక్క అధికారిపైనా, ప్రభుత్వంపైనా, ఎంపీలపైనా చర్యలు తీసుకునేందుకు తహతహలాడే నిమ్మగడ్డ… చంద్రబాబును ఎందుకు ఉపేక్షిస్తున్నారని అడిగారు.

రాజ్యాంగ విరుద్ధంగా మేనిఫెస్టో రిలీజ్ చేసినందుకు టీడీపీ గుర్తింపు రద్దు చేస్తారా? అని విజయసాయి ప్రశ్నించారు. శరీరం మాత్రమే నిమ్మగడ్డదని, చంద్రబాబు చంద్రముఖిలా మారి నిమ్మగడ్డను ఆవహించారని విజయసాయి అన్నారు. నిమ్మగడ్డ ఓ రాజకీయనేతలా వ్యవహరిస్తుండడం చూస్తుంటే అలాగే అనిపిస్తోందన్నారు.

నిమ్మగడ్డ మానసికంగా గాడితప్పిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎస్ఈసీ పదవిలో కూర్చోబెట్టడం ఏంటని విజయసాయిరెడ్డి అన్నారు. ఎస్ఈసీ పదవిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తినే నియమించాలని, నిమ్మగడ్డ మానసిక ఆరోగ్యంపై మెడికల్ బోర్డుకు సిఫారసు చేయాలని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశాల్లో నిమ్మగడ్డ మాటలు వింటుంటే ప్రవచనాలు చెప్పడంలో చాగంటి, గరికపాటి వారిని కూడా మించిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయని సెటైర్ వేశారు.[embedyt] https://www.youtube.com/watch?v=VRkS7keHWC0[/embedyt]