శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన దుర్గ గుడి అధికారులు

శ్రీశైల మల్లన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన దుర్గ గుడి అధికారులు

vijayawada durga temple official presented silk clothes to sri saila mallanna : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానం అధికారులు ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గ గుడి ఈవో సురేష్ బాబు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీశైలం భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఇంధ్రకీలాద్రి ఆలయ అధికారులకు శ్రీ శైల దేవస్ధానం అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల పట్టు వస్త్రాలకు శ్రీశైల దేవస్తానం ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణలు నిర్వహించి శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాలు సమర్పించారు.

ప్రతి సంవత్సరం దసరా మహోత్సవాలలో మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ. అయితే గత సంవత్సరం నుండి ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని ఈవో సురేష్ బాబు చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మల్లికార్జునస్వామి వారిని కోరుకున్నట్లు దుర్గా గుడి ఈవో సురేష్ బాబు తెలిపారు.