బెజవాడ గ్యాంగ్ వార్ లో రాజకీయ నాయకుల హస్తం ? 

  • Published By: murthy ,Published On : June 5, 2020 / 09:30 AM IST
బెజవాడ గ్యాంగ్ వార్ లో రాజకీయ నాయకుల హస్తం ? 

బెజవాడలో కలకలం రేపిన గ్యాంగ్‌వార్‌‌ కేసును పోలీసులు చేధించారు. కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈహత్యలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ సభ్యులు ఉన్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.

వీరుకాకుండా కొందరు విద్యార్ధులు కూడా ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పండు గ్యాంగ్, సందీప్ గ్యాంగ్ లపై పోలీసులు  మొత్తంగా 14 కేసులు పెట్టారు. ఈ కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ ఘటనలో రాజకీయ పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అన్నా అన్నా అంటూ తిరిగే  సందీప్‌, పండుల మధ్య వివాదాలు చంపుకొనే స్థాయికి ఎందుకు చేరాయి? అసలు ఒక్కసారిగా కత్తులు దూసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయ్..? అనే విషయాలపై ఈ గ్యాంగ్‌వార్‌లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా తోట సందీప్ భార్య తేజస్వినీ  చేసిన ఆరోపణలు  వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. 

సందీప్‌ని పక్కా స్కెచ్‌తో హత్య చేశారని.. లాండ్ సెటిల్మెంట్ గొడవలతో సందీప్‌కి సంబంధం లేదని… సందీప్ హత్య వెనుక కొందరు రాజకీయ నాయకుల పాత్ర ఉందని నాకు అనుమానం కలుగుతోందని తేజస్వినీ ఆరోపించారు.  సందీప్.. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాం.  

రాబోయే  కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట తాను పోటీ చేయాలనుకున్నానని, సాంకేతిక కారణాల వల్ల  అది కుదరక పోవటంతో టీడీపీ అభ్యర్థిగా సందీప్‌ పోటీ చేయాలని అనుకున్నాడు. అతనికి సీటు కూడా ఖరారైంది.  

ఎన్నికల బరినుంచి తప్పుకోవాలని ప్రత్యర్ధి పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి.. బెదిరింపులు వచ్చాయని ఆమె తెలిపారు. సందీప్ హత్యతో సంబంధం  ఉన్న రాజకీయ పెద్దలను పోలీసులు దర్యాప్తులో బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.  

అన్నా.. అన్నా అంటూనే పండు.. సందీప్ వెంట తిరిగేవాడు. గ్యాంగ్ వార్ ఘటనకు ముందు రోజు శుక్రవారం సాయంత్రం కలుద్దాము…మాట్లాడుకుందామని పడమటకు పిలిచి పండు హత్యకు కుట్ర పన్నాడు. సందీప్‌ను ఫోన్లో బెదిరించారు. సందీప్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పండు.. సందీప్‌ ఐరన్ షాపు దగ్గరకు వెళ్లాడు. 

సందీప్ అక్కడ లేకపోవడంతో షాపులో ఉన్న గుమస్తాపై పండు దాడి చేశాడు. సందీప్‌కు ఫోన్ చేసి నీ కుటుంబాన్ని అంతం చేస్తానని పండు బెదిరించాడు. ఈ హత్య కేవలం పండు ఒక్కిడే చేయలేదని అతని వెనుకాతల పండు బావమరిది ప్రశాంత్ , రవితేజ, ప్రభు వీళ్లు నలుగురు ఉన్నారని ఆమె ఆరోపించారు.  సందీప్ హత్యపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కారకులందరికీ శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. 

Read: సొంత చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న…దారుణ హత్య