విజయవాడ మేయర్ ఎవరు : జోరుగా బెట్టింగ్ లు, 10 లక్షలు కడితే..12 లక్షలు..

ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి.

విజయవాడ మేయర్ ఎవరు : జోరుగా బెట్టింగ్ లు, 10 లక్షలు కడితే..12 లక్షలు..

Mayor

Vijayawada Mayor : ఏపీలో మరో 48 గంటల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఏపీలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ మేయర్ అభ్యర్థి ఎవరన్నదానిపై జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో అభ్యర్థుల జాతకాలు బయటకు రానుండగా… కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఫలితాలపై ఉత్కంఠ ఆపుకోలేకపోతున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు.. మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది.. డివిజన్లలో ఎవరికి ఎంతెంత మెజారిటీ వస్తుంది.. ఏ పార్టీకి ఎన్ని డివిజన్లు దక్కుతాయి.. ఇలా కేటగిరిల వారీగా బెట్టింగులు కడుతున్నారు.

విజయవాడ కార్పొరేషన్‌లో మొత్తం 64 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. ఈనెల 14న ఫలితాలు వస్తాయి. కానీ… పార్టీల కార్యకర్తలు, నాయకులు మాత్రం గెలుపు ఓటములపై జోరుగా బెట్టింగులు కడుతున్నారు. 10 లక్షలు కడితే 12 లక్షలు ఇస్తామంటూ నేతలు బెట్టింగులకు పాల్పడుతున్నారు. కొన్ని డివిజన్లలో బెట్టింగ్‌ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వెళ్లింది. పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్‌ నుంచి టీడీపీ నుంచి విజయలక్ష్మి, వైసీపీ నుంచి పుణ్యశీల పోటీపడ్డారు. ఇక్కడ పుణ్యశీల సిట్టింగ్ కార్పొరేటర్‌. పైగా వైసీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. అయితే టీడీపీ తరపున మేయర్‌ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత పేరును టీడీపీ ప్రకటించింది. కేశినేని శ్వేత 11వ డివిజన్‌ నుంచి పోటీ చేశారు. ఇద్దరిలో మేయర్ పీఠం టీడీపీ దక్కించుకుంటుందని 10 లక్షలు కడితే… 12 లక్షల ఇస్తామని టీడీపీ శ్రేణులు పందెం వేస్తున్నాయి. అదే స్ధాయిలో వైసీపీ శ్రేణులు కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

విజయవాడ మేయర్‌ పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ఫిగర్‌ 33.. వైసీపీ నేతలు తమకు ఈ సంఖ్య దాటి డివిజన్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ నేతలూ అదే స్థాయిలో అంచనాలు వేస్తున్నారు. సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందని.. మొత్తంగా 40 డివిజన్లు దక్కుతాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎంతలేదన్నా.. 36 స్థానాలు కచ్చితంగా తమ ఖాతాలో పడతాయన్నది టీడీపీ నేతల లెక్క. ఒకవేళ 30 డివిజన్లు వచ్చినా మేయర్‌ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్నారు టీడీపీ నాయకులు. ఎక్స్‌అఫిషియో సభ్యులు టీడీపీకి అధికంగా ఉండడమే దీనికి కారణమంగా ఉంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా.. ఎవరి బెట్టింగ్ సంగతి ఎలా ఉన్నా… బెజవాడ మేయర్ పీఠం ఎవరిదనే విషయం ఈనెల 14న అధికారికంగా తేలనుంది.