Vinayaka Chavithi : తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి శోభ

దేశవ్యాప్తంగా వినాయకచవితి శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భక్తులు బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించేందుకు రెడీ అవుతున్నారు.

Vinayaka Chavithi : తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి శోభ

Vinayaka Chavithi Festival In Ap And Telangana

Vinayaka chavithi festival : దేశవ్యాప్తంగా వినాయకచవితి శోభ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. తెల్లవారుజామునే నిద్రలేచిన భక్తులు.. బొజ్జ గణపయ్యను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు, నైవేద్యాలు సమర్పించేందుకు రెడీ అవుతున్నారు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో వాడవాడలా భక్తులు గణనాథులు విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఇప్పటికే విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించారు. మరికొన్ని మండపాలకు గణనాథులను తరలిస్తున్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ దూరందూరంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయకచవితి సందర్భంగా నిన్న సాయంత్రం మార్కెట్లన్నీ కిటకిటలాడాయి. పత్రి, పూజాసామాగ్రి, మట్టి గణనాథుల విగ్రహాలను కొనేందుకు బారులు తీరారు భక్తులు. నిన్న రద్దీలో కొనుక్కోలేకపోయినవాళ్లు ఇవాళ తెల్లవారుజాము నుంచే మార్కెట్‌కు వెళుతున్నారు.

ఖైరతాబాద్‌లో ఈసారి 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువుతో.. కొలువుదీరాడు గణనాథుడు. పంచముఖ రుద్ర మహాగణపతి తలపై.. ఆది శేషులు, ఐదు తలలు, ఐదు చేతుల రూపంతో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. పార్వతీపరమేశ్వరులతో పాటు మహావిష్ణువు, సూర్య భగవానుని ముఖాలతో మహా గణపతిని తీర్చిదిద్దారు. విగ్రహం కింది భాగంలో ఐదుగురు దేవతల వాహనాలైన సింహం, నంది, మూషికం, గరుత్మంతుడు, అశ్వాలను చూడముచ్చటగా తయారు చేశారు.

వినాయకుడికి 10 చేతులుండగా కుడివైపున చక్రం, త్రిశూలం, గొడ్డలి, నాగుపాము, ఆశీర్వాదహస్తం, ఎడమ వైపున శంఖు, పాశము, కమలం, గద, లడ్డూ ఉన్నాయి. ఈసారి వినాయకుడికి కుడివైపున 12 అడుగుల ఎత్తుతో కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహం ఆకట్టుకుంటోంది. ఎడమ వైపున శ్రీకృష్ణుడిని ఆవహించిన కాళికా దేవి స్వరూపమైన కృష్ణ కాళి రూపంలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు.